టీడీపీ, జనసేన అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు వీరే!
ఇందులో భాగంగా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థుల జాబితాలను ప్రకటించింది. ఏడో విడత జాబితా నేడో, రేపో వెలువడొచ్చని అంటున్నారు. మరోవైపు కలిసి పోటీ చేయనున్న టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయని తెలుస్తోంది. ఇప్పటిదాకా తమతోపాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఈ రెండు పార్టీలు ఎదురుచూశాయి. అయితే బీజేపీ నుంచి ఇంతవరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో టీడీపీ, జనసేన అభ్యర్థులను ఖరారు చేశాయంటున్నారు. అయితే ముందుగా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించవచ్చని అంటున్నారు.
ఇందులో భాగంగా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పవన్.. చంద్రబాబు ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా సీట్లు, అభ్యర్థులపైనే చర్చ జరిగిందని చెబుతున్నారు.
టీడీపీ, జనసేన వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీకాకుళంలో ప్రస్తుత ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడే పోటీ చేయనున్నారు. ఇక విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు లేదా రామ్ మల్లిక్ నాయుడు, విశాఖపట్నంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యా సంస్థల అధినేత అయిన శ్రీభరత్ పోటీ చేస్తారని సమాచారం.
ఇక అరకు ఎంపీ నియోజకవర్గంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, అనకాపల్లి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి లేదా చింతకాయల విజయ్ లేదా బుద్ధా వెంకన్న, రాజమండ్రి నుంచి బొడ్డు వెంకట రమణ చౌదరి లేదా శిష్టా లోహిత్, అమలాపురం నుంచి మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీశ్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
ఇక నరసాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఏలూరు నుంచి గోపాల్‌యాదవ్ లేదా ఎన్నారై, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, గుంటూరు నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ లేదా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి, ఒంగోలు/నెల్లూరు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి/రాఘవరెడ్డి పోటీలో ఉంటారని తెలుస్తోంది.
ఇక తిరుపతి నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి లేదా నిహారిక, చిత్తూరు నుంచి మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లేదా ప్రముఖ నటుడు సప్తగిరి, కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ లేదా పార్థసారధి, కడప నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాజంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం, నంద్యాల స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి లేదా ఆయన కుమార్తె శబరి, అనంతపురం నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు లేదా పూల నాగరాజు, హిందూపురం నుంచి బీకే పార్థసారధి పోటీ చేస్తారని సమాచారం.
ఇక పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంటు సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. ఇందులో ఒకటి కాకినాడ, రెండోది మచిలీపట్నం. కాకినాడ నుంచి సానా సతీశ్, మచిలీపట్నం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున బరిలోకి దిగుతారని అంటున్నారు.
ఇక వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన/వస్తున్నవారిలో వైసీపీ రెబల్ ఎంపీలయిన రఘురామకృష్ణరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డికి తిరిగి సీట్లు లభించినట్టేనని తెలుస్తోంది. ఈ ముగ్గురితోపాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కు సీటు ఇవ్వవచ్చని టాక్ నడుస్తోంది.