జూనియర్ ముద్రగడకు వైసీపీ భారీ చాన్స్!
ఇపుడు ముద్రగడ కుమారుడు గిరిబాబు రాజకీయ అరంగేట్రానికి ఈ సీటుని ఎంచుకుంటున్నారు. తాత తండ్రిల బాటలో తాను కూడా ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీకి మొదటిసారి వెళ్లాలని చూస్తున్నారు.
గోదావరి జిల్లాలలో ముద్రగడ అన్న పేరు ఒక రీ సౌండ్. ముద్రగడ పద్మనాభం అంటే ఒక పొలిటికల్ వైబ్రేషన్. ఆయన తండ్రిని రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ముద్రగడ కూడా అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా కూడా పనిచేసారు. ఇక ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికల్లో మాత్రం బాగా వెనుకబడ్డారు. ఆయన వల్ల వైసీపీకి పెద్దగా ఒనగూడినది లేదని విశ్లేషణలు వచ్చాయి.
దాంతో పాటు పవన్ మీద సవాల్ విసిరి ఏకంగా తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ముద్రగడ ఈ రోజుకు తగ్గినా ఆయన రాజకీయ ప్రాధాన్యతకు మళ్ళీ మంచి రోజులు ఉంటాయని వైసీపీ అధినాయకత్వం గట్టిగా భావిస్తోంది. అందుకే ముద్రగడ కుటుంబాన్ని అసలు పక్కన పెట్టడం లేదు. ముద్రగడను 2024 ఎన్నికల ముందే ఎన్నికల్లో పోటీ చేయమని కోరినా ఆయన తిరస్కరించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. వైసీపీ మళ్లీ గెలిస్తే రాజ్యసభకు వెళ్ళాలని ఆయన ఆశపడ్డారని అంటారు.
ఇదిలా ఉంటే వైసీపీ అధినాయకత్వం ఇపుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముద్రగడ కుమారుడు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న గిరిబాబుని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జిగా నియమించింది. దాంతో ముద్రగడ వంశంలో మూడవ తరానికి వైసీపీ చాన్స్ ఇచ్చింది అంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక ముద్రగడ తండ్రి, ముద్రగడ ఇదే సీటు నుంచి అనెకా సార్లు గెలిచారు. 1994 తరువాత ముద్రగడ తన సొంత సీటుని వదిలేశారు.
ఇపుడు ముద్రగడ కుమారుడు గిరిబాబు రాజకీయ అరంగేట్రానికి ఈ సీటుని ఎంచుకుంటున్నారు. తాత తండ్రిల బాటలో తాను కూడా ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీకి మొదటిసారి వెళ్లాలని చూస్తున్నారు. అయితే ప్రత్తిపాడు సీటు టీడీపీకి కంచుకోట. ఎక్కువ సార్లు ఇక్కడ నుంచి ఆ పార్టీ గెలిచింది. కానీ 2014, 2019లలో మాత్రం వైసీపీ ఇదే సీటు నుంచి విజయ కేతనం ఎగురవేసింది.
ఇక 2024 ఎన్నికల్లో పరుపుల సత్యప్రభ ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె వైసీపీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ని ఓడించారు. వైసీపీ విషయానికి వస్తే ప్రత్తిపాడులో 2014 ఎన్నికల్లో పరుపుల సుబ్బారావుకి టికెట్ ఇచ్చింది. ఆయన గెలిచారు. కానీ టీడీపీలోకి వెళ్ళిపోయారు. 2019లో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కి టికెట్ ఇస్తే గెలిచారు. తిరిగి ఆయనను 2024లో రిపీట్ చేస్తే ఓటమి పాలు అయ్యారు. దాంతో ఈసారి ముద్రగడ కుమ్మారుడితో ప్రత్తిపాడు నుంచి ట్రై చేయాలని వైసీపీ హై కమాండ్ డిసైడ్ అయింది.
ఇక ముద్రగడ కుటుంబానికి ఇక్కడ ఉన్న ప్రాధాన్యత అనేక సార్లు గెలిచిన చరిత్రలో ఆయన వంశీకుడుగా వచ్చిన గిరిబాబుని 2029 ఎన్నికల్లో ఆదరించి అక్కున చేర్చుకుంటారు అని ఆశ అయితే వైసీపీలో ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ తరఫున ప్రస్తుతం పరుపుల సుబ్బారావు ఇంచార్జిగా ఉన్నారు. ఆయనని కాదని గిరిబాబుని తెచ్చారు.
మొత్తానికి ముద్రగడను వైసీపీలో ఉంచుకుని గోదావరి జిల్లాలలో ఆయనతోనే కూటమి మీద సమరం సాగించాలని వైసీపీ గట్టిగా డిసైడ్ అయింది అని అంటున్నారు. ఇక రానున్న రోజులలో వైసీపీ తరఫున ముద్రగడ ఫ్యామిలీ ఏ విధంగా కూటమి మీద సమర శంఖాన్ని పూరిస్తారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.