పవన్ కల్యాణ్ మగాడైతే... ముద్రగడ సంచలన వ్యాఖ్యలు!
ఈ క్రమంలో తాజాగా మరోసారి పవన్ పై ఫైర్ అయ్యారు ముద్రగడ. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మగాడైతే... అని మొదలుపెట్టడం గమనార్హం!
ప్రధానంగా పిఠాపురంలో పోటీచేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటినుంచి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వెంటాడుతున్న సంగతి తెలిసిందే! కొంతమంది కార్యకర్తలు.. కొంతమంది క్లబ్బులు నడుపుకునేవారు తనపై సోషల్ మీడియా వేదికగా అవాకులూ చేవాకులూ పేలుతున్నారని ఆయన నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి పవన్ పై ఫైర్ అయ్యారు ముద్రగడ. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మగాడైతే... అని మొదలుపెట్టడం గమనార్హం!
అవును... పవన్ కల్యాణ్ పై ముద్రగడ పద్మనాభం మరోసారి ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ సొంత ప్రాంతం హైదరాబాద్ నుంచి పిఠాపురానికి వచ్చి ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంతవరకూ సబబో ఆలోచించాలని తెలిపారు. పక్క నియోజకవర్గంలో అభ్యర్థి నిలబడ్డారంటే అర్ధం ఉంది కానీ.. ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలోని ఎమ్మెల్యే పదవి కావాలని అడగడం కరెక్ట్ కాదన్నట్లుగా ముద్రగడ తెలిపారు.
ఇదే సమయంలో... రాష్ట్ర ముఖ్యమంత్రిపై దారుణమైన పదజాలం వాడుతున్నారని.. మెడపై కాలుపెట్టి తొక్కుతా తొక్కుతానని పవన్ అంటున్నారని.. ఆ మాటలు ఇంకెవరినైనా అంటే కాలో చెయ్యో తీసేస్తారని స్పష్టం చేశారు. ఇదంతా పౌరుషమే అయితే... నాడు హైదరాబాద్ లో ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఏమైపోయిందని ప్రశ్నించారు! అవమానపరిచిన వ్యక్తి ఇంటికే వెళ్లి టిఫిన్ తినడం దారుణం అని అన్నారు.
అలాంటి వ్యక్తి నేడు పిఠాపురం వచ్చి ఉన్నది ఒకటి, లేనివి 10 మాటలు చెప్పి ఆవేశపడిపోతూ, ఆయసపడిపోతూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో తనపై వాళ్లతోనూ వీళ్లతోనూ తిట్టిస్తున్నారని చెప్పిన ముద్రగడం... పవన్ కల్యాణ్ తెరవెనుక ఉండి మాట్లాడటం కాదని, ప్రెస్ మీట్ పెట్టి నేరుగా తనను ప్రశ్నించాలని, విమర్శించాలని.. అప్పుడు తాను అన్నింటికీ సమాధానం చెబుతానని ముద్రగడ స్పష్టం చేశారు!
ఈ సందర్భంగా ధమ్మూ, ధైర్యం ఉంటే.. మగాడైతే నేరుగా తనను తిట్టాలని, ప్రశ్నించాలని.. అప్పుడు తాను ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని వెల్లడించారు. అనంతరం తాను అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఈ విషయంలో పవన్ ని రెండు మూడు సార్లు కోరినట్లు గుర్తు చేసిన ముద్రగడ.. స్పందన లేదు సరికదా, బూతులు మరింత ఎక్కువగా తిట్టిస్తున్నారని అన్నారు.
ఇక పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముడైపోయేవారిలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారని.. అలా అమ్ముడైపోవాల్సిన బ్రతుకు పిఠాపురం ఓటర్లకు లేదని స్పష్టం చేశారు. దీంతో... ఈసారైనా పవన్ రియాక్ట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.