విశాఖపై ముత్తయ్య మురళీధరన్ సెన్సేషనల్ కామెంట్
శ్రీలంకన్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ అజేయమైన కెరీర్ జర్నీ, వివాదాల గురించి పరిచయం అవసరం లేదు
శ్రీలంకన్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ అజేయమైన కెరీర్ జర్నీ, వివాదాల గురించి పరిచయం అవసరం లేదు. లెజెండరీ స్పిన్నర్‌పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలాగే మురళీధరన్ లైఫ్ జర్నీ ఆద్యంతం ఎమోషనల్ కంటెంట్ కి కొదవేమీ లేదని సన్నిహితులు చెబుతుంటారు. కారణం ఏదైనా కానీ ఇప్పుడు అతడి జీవితం వెండితెరకెక్కుతోంది. 800 పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్ లో నిజానికి తమిళ హీరో విజయ్ సేతుపతి నటించాల్సి ఉండగా, రకరకాల బెదిరింపులతో అతడు ఈ సినిమా నుంచి వైదొలగాల్సొచ్చింది. మధుర్ మిట్టల్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ఈ విషయాన్ని మురళీధరన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సేతుపతి కుటుంబానికి థ్రెట్ కాల్స్ వచ్చాయని, బెదిరించడం వల్లనే అతడు 800 మూవీ నుంచి తప్పుకున్నాడని ముత్తయ్య మురళీధరన్ వెల్లడించారు.
త్వరలోనే 800 మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో మురళీధరన్ పలు ఆసక్తికర విషయాలను ముచ్చటించారు. తాజాగా ప్రపంచంలో తనకు బాగా నచ్చిన నగరం ఏదీ? అని ప్రశ్నించగా మురళీధరన్ ఎలాంటి సంకోచం లేకుండా భారత్‌లో తనకు ఇష్టమైన సిటీ విశాఖపట్నం అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌తో పోల్చి చూస్తే తనకు వైజాగ్ సిటీ అంటే ఎంతో ఇష్టమని అన్నారు. దీనికి కారణం చెబుతూ.. వైజాగ్ వాతావరణం శ్రీలంకకు దగ్గరగా ఉంటుందని, సముద్ర తీర ప్రాంతం కావడం అదనపు ఆకర్షణను కలిగి ఉందని అన్నారు.
మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్ పతాకంపై వివేక్ రంగాచారి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. గిబ్రాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మహిమా నంబియార్, నాజర కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు.
ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక మాజీ క్రికెటర్. అతను క్రీడా చరిత్రలో గొప్ప బౌలర్లలో ఒకరిగా నిలిచారు. టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు .. వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్‌లో 530 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక బౌలర్. అతడు 1996 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. అతడి బౌలింగ్ యాక్షన్ కారణంగా వివాదాస్పద వ్యక్తిగా హెడ్ లైన్స్ కెక్కాడు. అతడి యాక్షన్ ని కొందరు అంపైర్లు విమర్శకులు ప్రశ్నించారు. అయితే బయోమెకానికల్ విశ్లేషణ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతడికి క్లీన్ చిట్ నిస్తూ ఆడేందుకు అభ్యంతరం లేదని అనుమతినిచ్చింది. అతడు 2011 లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కోచ్, వ్యాపారవేత్త, ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యుడుగా కొనసాగుతున్నారు.
మురళీధరన్ 1972 ఏప్రిల్ 17న శ్రీలంకలోని క్యాండీలో హిల్ కంట్రీలో తమిళ హిందూ కుటుంబంలో సిన్నసామి ముత్తయ్య -లక్ష్మి దంపతులకు జన్మించాడు. అతడు నలుగురు కుమారులలో పెద్దవాడు. మురళీధరన్ తండ్రి సిన్నసామి ముత్తయ్య విజయవంతమైన బిస్కెట్ తయారీ వ్యాపారి. మురళీధరన్ తాత పెరియసామి సినసామి 1920లో మధ్య శ్రీలంకలోని తేయాకు తోటలలో పని చేయడానికి దక్షిణ భారతదేశం నుండి వచ్చారు. సినసామి తరువాత తన కుమార్తెలతో తన పుట్టిన దేశానికి తిరిగి వచ్చి భారతదేశంలోని తమిళనాడు- తిరుచిరాపల్లిలో స్థిరపడ్డాడు. అయినప్పటికీ మురళీధరన్ తండ్రి ముత్తయ్య సహా అతని కుమారులు శ్రీలంకలోనే ఉన్నారు.