రూ.వందల కోట్ల విలువైన భూములు.. మాజీ ఎంపీకి బిగ్‌ షాక్‌!?

ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది

Update: 2024-06-25 16:18 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. ఇటీవల ఎన్నికల్లో తాను గెలిచాక విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని.. ప్రమాణస్వీకారం కూడా విశాఖపట్నంలోనే చేస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో దీనికి అడ్డుకట్ట పడింది.

వాస్తవానికి వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖపట్నంలో వందల కోట్ల రూపాయల విలువైన భూములను చెరపట్టిందనే విమర్శలు వెల్లువెత్తాయి. యజమానులను బెదిరించి చాలా తక్కువకే వైసీపీ ముఖ్య నేతలు భూములు కొట్టేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై నగరంలోని ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో కేసు దాఖలైంది. ఈ మేరకు హయగ్రీవ కనస్ట్రక్షన్స్‌ అధినేత జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు. హయగ్రీవ భూముల విషయంలో తనను బెదిరించి ఎంవోయూ పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతోపాటు ఆయన ఎడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) సహా రియల్టర్‌ గద్దె బ్రహ్మాజీపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తనను బెదిరించి విలువైన భూములు కొట్టేయడానికి ఎంవీవీ సత్యనారాయణ ప్రయత్నించారని జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంవీవీ సత్యనారాయణపై పోలీసులు సెక్షన్‌ 120, 420, 34 ఐపీసీలతో సహా 10కి పైగా నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టారు.

తనపై పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఎంవీవీ సత్యనారాయణకు జీవీఎంసీ (గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌) కూడా కొద్ది రోజుల క్రితం షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అశీలమెట్ట టైకూన్‌ కూడలి దగ్గర సీబీసీఎన్సీ స్థలంలో ఎంవీవీ వెంచర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఆపేయాలని జీవీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థ జరుపుతున్న పేలుడుతో తమ భవనాలు దెబ్బతింటున్నాయని పలువురు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాణాలను ఆపేశారు.

కాగా 2019లో విశాఖ నుంచి వైసీపీ ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ స్వల్ప మెజార్టీతో గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్‌ పై గెలుపొందారు. ఇటీవల ఎన్నికల్లో ఎంవీవీ సత్యనారాయణ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Tags:    

Similar News