దానం లెక్కలే వేరప్పా.. ఢిల్లీ నుంచి గల్లీకి నరుక్కొచ్చాడుగా!

మూడున్నర నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరటం.. రేవంత్ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే.

Update: 2024-03-16 04:40 GMT

కాలం కర్మం కలిసి రానప్పుడు ఎంతటి తోపు అయినా అప్రాధాన్యంగా ఉండిపోతారు. తమకంటూ టైం కోసం వెయిట్ చేసే ఓపిక ఉండాలే కానీ ఏదో ఒక రోజు తమదైన రోజు వస్తుది. సుదీర్ఘకాలంగా తన టైం కోసం నిరీక్షిస్తున్న మాజీ మంత్రి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఇప్పుడు తన టైం వచ్చేసింది. మూడున్నర నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరటం.. రేవంత్ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే.

దశాబ్దానికి పైనే బీఆర్ఎస్ లో ఉన్నా.. తనకంటూ ఎలాంటి గుర్తింపును పొందలేక.. అలా అని బయటకు రాలేక సిత్రమైన పరిస్థితుల్లో ఉన్న ఆయన.. రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత సొంత పార్టీలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు. అందుకు రేవంత్ అండ్ కో ససేమిరా అన్నాయి. అలా అడ్డుకుంటే ఆగే గుణం దానంలో ఉండదు కదా. తనకున్న పాత లింకుల్నియాక్టివేట్ చేసిన ఆయన.. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడిపి ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరేందుకు తగిన ప్లాట్ ఫాంను సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

శుక్రవారం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల్లో ఒకటి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కలిసి గ్రూప్ ఫోటో దిగిన దానం నాగేందర్ తాను గులాబీ కారు నుంచి దిగిపోతున్న స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చేశారు. ఆ తర్వాత నుంచి ఎవరికి అందుబాటులోకి రాకుండా ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారు. ఇంతకూ దానం కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఎప్పుడు ఇవ్వనున్నారు? ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అందిన హామీ ఏమిటి? ఆయనకు ఇచ్చిన టాస్కు ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ మహానగంలో ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి చేరటం ద్వారా విన్ టు విన్ విధానానికి తెర తీశారని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు లోక్ సభ స్థానాల్లో రెండింటిలో (సికింద్రాబాద్, మల్కాజిగిరి) బరిలోకి దిగేందుకు సత్తా ఉన్న అభ్యర్థులు లేని పరిస్థితి. ఆ లోటును భర్తీ చేయటంలో దానం హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఖర్చు విషయంలోనూ వెనుకాడనన్న హామీని ఇచ్చినట్లుగా తెలిసిందే.

లోక్ సభ ఎన్నికల్లో అయితే సికింద్రాబాద్ లేదంటే మల్కాజిగిరిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయటం.. ఫలితంలో తేడా వస్తే రాష్ట్ర మంత్రి పదవిని నజరానాగా ఇవ్వనున్నట్లుగా ఒప్పందం జరిగిందంటున్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎలాంటి గుర్తింపు పదవి లేక ఆవురావురమంటున్న దానంకు తాజా డీల్ బంఫర్ ఆఫర్ గా చెబుతున్నారు. మొత్తంగా భారీ స్కెచ్ తో కాంగ్రెస్ లోకి చేరుతున్న దానం ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News