బాల్క సుమన్ సంపాదన 500 కోట్లా?
కొద్దికాలం క్రిందటి వరకు బీఆర్ఎస్‌లో ఉండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తాజాగా సుమన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ఉన్న నేతలు ఎప్పుడు అందలం ఎక్కుతారో... ఎప్పుడు అధఃపాతాళానికి చేరుతారో అంచనా వేయలేం. కొందరు నేతలు దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు. మరికొందరు నేతలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు తమ సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి నేతల్లో మాజీ ఎంపీ, ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే ఒకరు. బీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ నమ్మినబంటు అనే ముద్ర వేసుకున్న బాల్క సుమన్ తాజాగా స్వపక్ష, ప్రతిఫక్ష నేతలకు టార్గెట్ అవుతున్నారు. కొద్దికాలం క్రిందటి వరకు బీఆర్ఎస్‌లో ఉండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తాజాగా సుమన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నామని, అందుకే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. తాను ఇక చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు. చెన్నూరు నియోజకవర్గం రజాకార్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లుగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే సుమన్ నియోజకవర్గ నేతలను ఎవరినీ ఎదగనివ్వడం లేదని ఓదెలు తెలిపారు. తన భార్యకు మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ పదవి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని, అంతేగానీ బాల్క సుమన్ కాదని చెప్పారు. తనకు ప్రజలు అవకాశం ఇస్తే తమ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.
తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి మళ్లీ అదే పార్టీలోకి వెళ్లినందుకు ప్రజలు క్షమించాలని ఓదెలు కోరారు. గత ఏడాది తమను మంత్రి కేటీఆర్ పిలిచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని, ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తామని చెప్పారని వివరించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ రెండుసార్లు తన ఇంటికొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. నియోజకవర్గంలో బాల్క సుమన్ రూ.500 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.