పవర్ పోయాక అవే పాడు పనులా? మాజీ ఎంపీ బ్రదర్ అరెస్టు

అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసేయొచ్చు. కానీ.. అధికార బదిలీ జరిగిన తర్వాత కాస్తంత ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది

Update: 2024-07-01 11:22 GMT

అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసేయొచ్చు. కానీ.. అధికార బదిలీ జరిగిన తర్వాత కాస్తంత ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ పట్టించుకోకుండా.. తామేం చేసినా ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాను ప్రదర్శిస్తుంటారు కొందరు నేతలు. అలాంటి బరితెగింపునకు భారీ షాక్ తగిలింది. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు తాజాగా అరెస్టు చేశారు పోలీసులు.

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కేసులో అతన్ని అరెస్టు చేయటం గమనార్హం. ఆదివారం రాత్రి ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలు ఎవరివి? దీని వెనుక ఉన్న వారెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికే క్రమంలో పోలీసులకు మాజీ ఎంపీ సోదరుడి వివరాలు వెల్లడయ్యాయి. దీంతో.. మాజీ ఎంపీ నందిగంసురేశ్ సోదరుడు ప్రభుదాస్ ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్న వేళలో ఇసుక అక్రమ రవాణా భారీగా జరిగేది. ఆ మాటకు వస్తే.. ఇసుక అక్రమ రవాణా జగన్ సర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. అయితే.. ఈ విషయాన్ని నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. అక్రమ ఇసుక దందా కారణంగా భారీగా ధరలుపెరగటంతో పాటు.. ఇష్టారాజ్యంగా ఇసుక రీచ్ లను తవ్వేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

సాధారణంగా ప్రభుత్వాలు మారిన తర్వాత అక్రమ వ్యాపారాలను ఆపేస్తుంటారు. అందుకు భిన్నంగా పలువురు వైసీపీ నేతలు తమ అక్రమ ఇసుక రవాణా కార్యక్రమాల్ని ఆపని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి సర్కారు అక్రమ ఇసుక రవాణా మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపడతున్నారు. తాజాగా నందిగం సురేష్ సోదరుడు అడ్డంగా బుక్ అయినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News