ఖాళీకుర్చీలు 'మడత' పెట్టుకోవడానికి మీకు టైం సరిపోదు
ఏపీ రాజకీయాల్లో 'మడత' కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మడత వ్యాఖ్యలు పెరుగుతున్నాయి.
ఏపీ రాజకీయాల్లో 'మడత' కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మడత వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన.. వలంటీర్లకు వందనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. వలంటీర్లు, యవతకు ఒక పిలుపునిచ్చారు. ''మన ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయాలంటే.. మీరంతా కదలాలి. చొక్కలు మడత పెట్టాలి'' అని వ్యాఖ్యానించారు. వేదికపైనే తన చొక్కాను మడత పెడుతూ..ఆయన చూపించారు.
ఇక, అప్పటి నుంచి వైసీపీవర్సెస్.. టీడీపీ మధ్య ఈ మడత రాజకీయాలు పెరిగాయి. ఆ వెంటనే చంద్రబా బు ఉండవల్లిలో రాజశ్యామల యాగంప్రారంభించిన తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేసినకామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. ''ఆయనేదో(జగన్) చొక్కలు మడత పెడుతున్నాడు. ఆయన కుర్చీ మడత పెట్టడానికి జనాలు సిద్ధంగాఉన్నారు. ముందు ఆ విషయం చూసుకోమనండి'' అని అన్నారు.ఇక, దీనికి కొనసాగింపుగా.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా.. మడత వ్యాఖ్యలు చేశారు.
తాజాగా విజయనగరం,. విశాఖ జిల్లాల్లో నిర్వహించిన శంఖారావం సభల్లో నారా లోకేష్ మాట్లాడుతూ.. ''సైకో జగన్ చొక్కాలు మడత పెడుతున్నాడు. కానీ, ఆయన కుర్చీ మడత పెట్టేందుకు టీడీపీ-జనసేన రెడీ అయింది. ముందు ఈ విషయంగుర్తు పెట్టుకోవాలని చెబుతున్నా'' అని వ్యాఖ్యానిస్తూ..ఆ వెంటనే వేదికపై ఉన్న కుర్చీని మడత పెట్టి.. ఆయన సభలో జనాలకు చూపించారు. ఇక, ఈ వ్యాఖ్యలు వైసీపీలో కాక పుట్టించాయి.
దీనికి కౌంటర్‌గా వైసీపీ కీలక నాయకుడు, మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా వ్యాఖ్యలతో దుమ్ము రేపారు. ''వలంటీర్లు, వైసీపీ నాయకులు ఎక్కడచొక్కా మడతపెడతారోనని.. నారా లోకేష్‌లో ఖంగారు మొదలైంది. షామియానా షాపు నుంచి కుర్చీ తెచ్చి దాన్ని మడత పెట్టాడు. టీడీపీ మీటింగులకు జనం రాక.. ఖాళీగా ఉండిపోయే కుర్చీలను మడత పెట్టుకోవడానికి మీకు టైం సరిపోదు'' అని వ్యాఖ్యలు సంధించారు. జగన్ కాలర్ మడత పెడితే.. టీడీపీ నాయకులు.. కుర్చీలు మడత పెడుతున్నారని.. వారి కుర్చీని(అధికారం) ప్రజలు ఎప్పుడో మడత పెట్టేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.