ఏడుకొండల వాడే లడ్డూ గురించి నిజాలు మాట్లాడించారు...!

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తన మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయని ఒక అతి బరువైన తీవ్రమైన అత్యంత సెంటిమెంట్ తో కూడిన ప్రకటనను చేశారు.

Update: 2024-09-21 13:58 GMT

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తన మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయని ఒక అతి బరువైన తీవ్రమైన అత్యంత సెంటిమెంట్ తో కూడిన ప్రకటనను చేశారు. ఆ ప్రకటన చేసినపుడు ఇంతలా ఆధ్యాత్మిక దుమారం రేగుతుందని బాబుకు తెలుసో లేదో, రాజకీయ దుమారం అయితే రేగడం ఖాయమని భావించే బాబు ఈ బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

గత అయిదేళ్ళుగా తిరుమలలో ప్రతీ విషయం మీద టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకల గురించి కూడా మాట్లాడింది. అలాగే తిరుమలలో అపచారాలు అంటూ ఎన్నో విమర్శలు చేసింది. అయితే అవన్నీ ఒక ఎత్తు. లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు.

లడ్డూ ప్రసాదం అంటే సాక్షాత్తు స్వామి వారినే వివాదంలోకి తీసుకుని వచ్చినట్లు. ఈ మాట చెప్పడానికి ఎక్కడ లేని గుండె ధైర్యం కావాలి. నిజానికి టెస్టులు జరిగాయని శాంపిల్స్ వచ్చాయని అంటున్నారు కానీ పూర్తి స్థాయి విచారణ ఇంకా జరగలేదు అంటున్నారు. . ఇంతలో బాబు నోరు జారారా లేక అతి ఉత్సాహంతో చెప్పారా అన్నది కూడా చూడాలని అంటున్నారు.

చంద్రబాబు తిరుమల లడ్డూ గురించి చేసిన వ్యాఖ్యల మీద నమ్మిన వారు ఉన్నారు. నమ్మని వారు ఉన్నారు. ఏది ఏమైనా వర్టికల్ గా ఒక చీలిక వచ్చింది. రెండు వైపులా వాదనల సంగతి ఎలా ఉన్నా నిజా నిజాలు వెలితి తీయాలన్న డిమాండ్ అంతకంతకు పెరిగిపొతోంది. ఈ విషయంలో ఆషామాషీగా విచారణ ఉండరాదని కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాను కూడా ఈ వ్యాఖ్యలు చేయాలని అనుకోలేదని అంటూ చెప్పడం విశేషం. కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇందులో ముడిపడి ఉంటాయని తనకు తెలుసు అని కూడా బాబు అంటున్నారు. అయితే తన చేత ఆ ఏడు కొండల వాడే లడ్డూ గురించి అలా నిజాలు చెప్పించాడేమో అని బాబు అనడం విశేషం.

ఆ దేవదేవుడు నిజాలు చెప్పాలని తనను అలా మాట్లాడించాడని బాబు అంటున్నారు. మనం అంతా నిమిత్తమాత్రులమని కూడా బాబు వేదాంత ధోరణిలో అన్నారు దేవుడే అన్నీ చేయిస్తాడు, ఇపుడు తాను చెప్పినది కూడా ఆ దేవుడి మాటనే అని ఆయన అన్నారు. లడ్డూల గురించి కూడా తాను చెప్పింది అలాంటిదే అని అనుకుంటున్నాను అని బాబు అనడం గమనార్హం.

శ్రీవారి ఆలయంలో గత అయిదేళ్ళుగా ఎన్నో అపచారాలు జరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. పరమ పవిత్ర పుణ్య క్షేత్రం లో పనిచేసేటపుడు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆయన అన్నారు వైసీపీకి మాత్రం ఆ విషయమే పట్టలేదని నిప్పులు చెరిగారు. శ్రీవారి ఆలయ సెట్ ని ఇంటి దగ్గర వేసుకోవడం ఏ రకమైన బరితెగింపు అని ఆయన ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ అనడం పట్ల ఆయన మండిపడ్డారు.

టీడీపీ సహా ఏపీలో దేవాలయలా పవిత్రతను దారుణంగా దెబ్బ తీసిన వారు ఇపుడు ఎదురు దాడి చేస్తున్నారు అని వైసీపీ నేతల మీద బాబు ఫైర్ అయ్యారు. టీటీడీని సమూలంగా ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే చెప్పాను అని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా కొత్త ఈవో అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.

అలాగే అనేక సంస్థలు బ్లాక్ లిస్టులో పెట్టారని కూడా చెప్పారు. లడ్డూ నాణ్యత కోసం నందిని సంస్థ నుంచి మళ్లీ నెయ్యి కొనుగోలు చేశారు. ఆయన ఈ విధంగా ప్రక్షాళన చేశారు కానీ ప్రతీ రోజూ వచ్చి ఆ వివరాలు చెప్పలేరు కదా అందుకే తాను లడ్డూల విషయం మాట్లాడాల్సి వచ్చిందని బాబు అన్నారు. మొత్తానికి బాబు ఈ విధంగా చెప్పడం వెంకటేశ్వర స్వామి వారి ఆదేశం అనే బాబు అంటున్నారు. చూడాలి మరి బాబుని లడ్డూల నాణ్యత విషయంలో ఎంచుకున్న స్వామి వారు ముందు ముందు ఏ రకమైన ప్రక్షాళనకు టీడీపీలో అవకాశం ఇస్తారో.

Tags:    

Similar News