తెలుగు పాలిటిక్స్ 2024 : నారా లోకేష్ కు అలా కలిసొచ్చింది !
ఇక తెలుగుదేశం హవా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాగింది.
మరి కొద్ది రోజులలో 2024 సంవత్సరం ముగుస్తోంది. చాలా దూకుడుగా ఈ ఏడాది నడచింది అని చెప్పాలి. ఈ ఏడాది విశేషం ఏంటి అంటే ఎన్నికలు జరగడం, కేంద్రంలో రాష్ట్రంలో ఒకేసారి జరిగిన ఎన్నికల్లో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ, నాలుగో సారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేశారు.
ఇక తెలుగుదేశం హవా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాగింది. ఆ పార్టీ మొత్తం 144 సీట్లకు పోటీ చేస్తే 135 సీట్లు సాధించడం గ్రేట్ అని చెప్పాలి. ఈ విషయంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కృషి కూడా ఉందని తెలుగు తమ్ముళ్ళు గట్తిగా భావిస్తున్నారు.
నారా లోకేష్ గురించి చెప్పాలీ అంటే ఆయనకు ఈ ఏడాది కలసి వచ్చిన ఇయర్ గానే చూడాలి. నారా లోకేష్ రెండవసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మొదటిసారి 2017లో ప్రమాణం చేశారు. రెండేళ్ళ పాటు ఆ పదవిలో ఉన్నారు. ఈసారి ఆయనకు కీలకమైన శాఖలు దక్కాయి.
దాంతో పాటుగా ఆయన మంత్రిగా మరింతగా రాణిస్తున్నారు. పార్టీలో ఎటూ చంద్రబాబు తరువాత ప్లేస్ లో ఉన్నారు. ప్రభుత్వంలోనూ కీలకంగా మారుతున్నారు. చంద్రబాబు తరువాత ఆయనే అన్ని వ్యవహారాలూ చూస్తున్నారు అన్న ప్రచారం ఉంది.
మరీ ముఖ్యంగా టీడీపీకి ఒక చింత అయితే ఉంటూండేది. చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించేది ఎవరు అన్నది చర్చగా పార్టీ లోపలా బయటా ఉండేది. అది నిరంతరం సాగుతూ వచ్చింది. అయితే 2024 మాత్రం ఆ చరకు ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టేసింది అని చెప్పాలి. చంద్రబాబుకు అసలైన వారసుడు నారా లోకేష్ అని ఈ ఎన్నికలు తేల్చాయి.
నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 2024 మొదట్లో ముగిసింది. అది కూడా ఉత్తరాంధ్రాలో ముగింపు సభగా నిర్వహించారు. దాని ఫలితాలు ఎన్నికల్లో సైతం కనిపించాయి. లోకేష్ కనీ వినీ ఎరుగని మెజారిటీతో గెలిచారు. ఆయనకు ఏకంగా 90 వేల మెజారిటీ దక్కింది.
ఇక ఆయన మంత్రిగా అయ్యాక ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావడం, అమెరికాలో పెట్టుబడుల కోసం పది రోజుల పాటు పర్యటించి మంచి ఫలితాలు సాధించడం వంటివి ఆయన ఇమేజ్ ని పెంచాయి. చంద్రబాబుకు ధీటుగా లోకేష్ ఎదుగుతున్నారు అన్న భావన అయితే పార్టీలో కనిపిస్తోంది.
ఇక టీడీపీలో నవతరం నాయకులు అంతా లోకేష్ వెంట ఉంటున్నారు. ఆయనలో భావి సీఎం ని చూస్తున్నారు. ఇక మంత్రివర్గం కూర్పు నుంచి పార్టీ ప్రభుత్వ పదవులు అన్నీ కూడా కొత్త తరానికి యువతకు దక్కడం వెనక లోకేష్ ఆలోచనలు ఉన్నాయని ప్రచారంలో ఉంది.
ఇవన్నీ చూస్తే కనుక 2024 ఏపీలో లోకేష్ ని బలమైన నేతగా మార్చింది అని చెప్పాలి. గతంలో లోకేష్ రాజకీయం మీద విమర్శలు చేసిన వారు సైతం ఇపుడు ఆయన బాగా రాణిస్తున్నారు అని అంటున్నారు. లోకేష్ కి సీఎం అయ్యే చాన్స్ ఉందని కూడా అంతా అంటున్నారు
అంటే అది కచ్చితంగా 2024 లో ఆయనకు దక్కిన ఒక అవకాశంగా చెప్పుకోవాలి. ఏపీ రాజకీయాల్లో నూతన తరానికి ప్రతినిధిగా లోకేష్ ఎదుగుతున్నారు. ఆ విధంగా ఆయన రాజకీయానికి 2024లో పదును పెట్టుకుని 2025లో అడుగుపెడుతున్నారు అన్నది మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.