బిగ్ బ్రేకింగ్: ముగిసిన వాదనలు... ఏక్షణమైనా తీర్పు!
సంచలన సృష్టించిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి.
సంచలన సృష్టించిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ సీఐడీ తరుపున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరుపున సిద్ధార్థ్ లూథ్రా లు పోటీపోటీగా తమ తమ వాదనలు వినిపించారు.
ఇందులో భాగంగా చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసింది. రిమాండ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు చేర్చామని, స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంతోపాటు వివిధ అక్రమాల్లో చంద్రబాబు పాత్ర ఉందని తెలిపింది. అందుకోసం చంద్రబాబును విచారించేందుకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఇవాలని కోర్టుకు విన్నవించింది.
చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని.. శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని చంద్రబాబు తరుపు న్యాయవాది కోరారు. గవర్నర్ అనుమతి లేకుండానే అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పుకొచ్చారు.
ఇలా ప్రజాప్రతినిధి అరెస్టుపై గవర్నర్ కు సమాచారం ఇవ్వాలన్న చంద్రబాబు లాయర్ వాదనలకు సీఐడీ కౌంటర్ ఇచ్చింది. ఈ కేసుల్లో స్పీకర్ కు సమాచారం ఇస్తే సరిపోతుందని, దర్యాప్తు అధికారులు ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని సీఐడీ తరుపు లాయర్ వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తుచేశారు!
ఇలా గంటల తరబడి సాగిన వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారని తెలుస్తుంది. ఏ క్షణమైనా తీర్పు వెలువడొచ్చని అంటున్నారు!
మరోపక్క ఏ క్షణమైనా తీర్పు రావొచ్చనే ఉద్దేశ్యంతో విజయవాడలోని ఏసీబీ కోర్టువద్ద పోలీసు శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. భారీగా పోలీసు బలగాలను మొహరించింది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం!