మోడీ మంత్రానికి కాశ్మీర్ యాపిల్ దక్కుతుందా ?
కాశ్మీర్ అంటే బ్రహ్మాండమైన తీపి కలిగిన ఎర్రెర్రటి యాపిల్స్ గుర్తుకు వస్తాయి.
కాశ్మీర్ అంటే బ్రహ్మాండమైన తీపి కలిగిన ఎర్రెర్రటి యాపిల్స్ గుర్తుకు వస్తాయి. అంతేనా అందమంతా కుప్ప పోసినట్లుగా ఉండే అధ్బుత పరిసరాలు కనిపిస్తాయి. భారతదేశం అంతా ఒక స్రీ మూర్తి అయితే ఆమె నుదుటన వెలసిన సింధూరంగా కాశ్మీర్ ని అంతా అభివర్ణిస్తారు.
అంతే కాదు దేశ రక్షణకు కూడా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కాశ్మీర్. కాశ్మీర్ ని విడదీసిన మిగిలిన భారతం ఎంత గొప్పది అయినా భద్రతా పరంగా ఏమీ కానట్లే. అంతే కాదు శిరస్సు లేని శరీరంగా ఉంటుందని కూడా అంటారు అందుకే అన్ని విధాలుగా చూస్తే కాశ్మీర్ కి అంతటి ప్రాధాన్యత.
పైగా కాశ్మీర్ కోసం గత ఏడున్నార దశాబ్దాలుగా అటు పాక్ తో భారత్ పోరాడుతోంది అంటే దానిని రక్షించుకోవడానికే. భారత్ లో కాశ్మీర్ అంతర్భాగం అని మిగిలిన పాలకులు చెప్పారే కానీ దానిని చేతలలో చూపించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే 2019 ఆగస్ట్ నెలలో 370 ఆర్టికల్ ని రద్దు చేసి మరీ కాశ్మీర్ ని భారత్ లో పూర్తిగా భాగం చేసింది. ఏ రకమైన అడ్డుగోడలు లేకుండా చేసింది.
అది జరిగిన తరువాత ఇపుడు కాశ్మీర్ కి ఇవే తొలి ఎన్నికలు. మరి మూడ్ ఆఫ్ కాశ్మీర్ ఎలా ఉందో కొద్ది రోజులలో మూడు విడతలుగా జరగబోయే ఎన్నికలు తెలియ చేయనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే కాశ్మీర్ లో హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. ఇపుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ పర్యటనకు వెళుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆయన అక్కడ ప్రారంభిస్తారు.
ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూలో పర్యటించనున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించడం ద్వారా స్థానిక ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. దాంతో మోడీ పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
మరో వైపు చూస్తే అసెంబ్లీ ఎన్నికల కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ లో గట్టి పట్టుని సాధించేందుక్ బిజెపి తన ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. ఎన్నికల వ్యూహాలను సైతం రచిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అలాగే హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. ఇపుడు ప్రధానమంత్రి పర్యటనని బీజేపీ హైలెట్ గా భావిస్తోంది.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం జమ్మూలో రాంబన్, బనిహాల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించారు. ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు కూడా ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. కాశ్మీర్ ఎన్నికల్లో మద్దతుని కోరారు. బీజేపీ గెలిస్తే పీవోకేను భారత్ లో కలిపేస్తుందని కూడా హామీ ఇచ్చారు
ఆయన కంటే ముందు శుక్ర, శనివారాల్లో కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లలో హోంమంత్రి అమిత్ షా సభలు నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు.
ఇక బీజేపీ మేనిఫెస్టోలో కాశ్మీర్ ప్రజల కోసం ఏకంగా పాతిక దాకా హామీలను ఇచ్చారు. వాటిలో కీలకమైనది రాష్ట్రంలో ఉగ్రవాదం వేర్పాటువాదానికి తుడిచిపెట్టడం, అలాగే, మహిళల ఆర్థిక భద్రత స్వావలంబనకు ప్రాధాన్యత ఇవ్వడం.
అంతే కాదు జమ్మూ-కశ్మీర్‌లో ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తామని అభివృద్ధి చేస్తామని మరియు ఇప్పటికే ఉన్న వ్యాపారాలలతో పాటు చిన్న వ్యాపారులకు మద్దతు ఇస్తామని కాషాయం పార్టీ హామీ ఇచ్చింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్‌లను రూ. 1,000 నుంచి రూ. 3,000కి మూడు రెట్లు పెంచుతామని, బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితానికి హామీ ఇస్తానని బీజేపీ హామీ ఇచ్చింది.
ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సభలలో ఏ రకమైన హామీలు ఇస్తారు, ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత్ లో కాశ్మీర్ అంతర్భాగమని దానిని తమ ప్రభుత్వం సాధించిందని ప్రజలకు కేంద్రం భద్రత భరోసా ఇస్తుందని చెప్పుకోవడం 370 ఆర్టికల్ రద్దుని హలెట్ చేయడమే మోడీ సభల్లో కనిపిస్తుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఈ నెల 18, 25 అలాగే, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఇక్కడ జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా చూస్తోంది అని చెప్పాల్సి ఉంది.