మాటల మోడీ.. ఇలాంటి వేళలో కదా మాట్లాడాలి?

మాటలు చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హటాత్తుగా తన సహజలక్షణానికి భిన్నంగా మౌనంగా ఉండటం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసేదే

Update: 2023-12-15 05:34 GMT

మాటలు చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హటాత్తుగా తన సహజలక్షణానికి భిన్నంగా మౌనంగా ఉండటం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసేదే. తన గురించి.. తన పాలన గురించి గొప్పలు చెప్పుకునేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించే ప్రదానమంత్రి.. ఏదైనా కష్టం వచ్చినా.. సమస్య ఎదురైనా.. సవాలు విసిరినా.. సంక్షోభ సమయాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండటంలో అర్థం లేదని చెప్పాలి. గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఏ రోజు కూడా తమకు ప్రతికూల వాతావరణం ఉందని భావించినా.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మోడీ మౌనమునిగా మారిపోతారు.

ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోయే మోడీషాలు.. కనీసం పార్లమెంటు కు కూడా హాజరు కాకపోవటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అనూహ్య పరిణామం ఏర్పడినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులోకి చొరబడిన సామాన్యులు.. పొగ వస్తువుల్ని సభలో వదిలేలా చేసే పరిస్థితి వచ్చిందంటేనే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం.. నిఘా విభాగం లోపమే కారణమని చెప్పాలి.

మరి.. ఇలాంటి వేళ.. జరిగిన తప్పుల్ని.. గుర్తించిన లోపాల్ని బాధ్యతగా సభకు వివరించాల్సిన అవసరం మోడీ ప్రభుత్వానికి లేదా? అన్నది పెద్ద ప్రశ్న. అన్నింటికి మించి బాధ్యత వహించాల్సి ఉందని గుర్తించకపోవటం దేనికి నిదర్శనం? గొప్పులు చెప్పుకోవటానికి సభను వాడేసే మోడీషాలు.. సంక్లిష్ట పరిస్థితుల్లో ముఖం చాటేయటం మంచి సంప్రదాయం అవుతుందా? విలువలు.. నీతులు బోధిస్తూ ప్రసంగాలు చేసే ప్రధానమంత్రి.. పార్లమెంటులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా?

ప్రతిపక్షాల ప్రశ్నలన్నింటికి సమాధానం ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చు. కానీ.. చట్టసభలోకే ఆందోళనకారులు వచ్చేంత దైన్యం దేనికి నిదర్శనం? ఆందోళన పేరుతో ఆగంతకుల ఆరాచకానికి బాధ్యులుగా పేర్కొంటూ ఏడుగురు అధికారుల్ని సస్పెండ్ చేయటంతో సమాధానం ఇచ్చేసినట్లు కాదు కదా? ఆ మాటకు వస్తే.. ఆగంతకులకు పార్లమెంటులో అడుగు పెట్టేందుకు వీలుగా పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్నది కూడా ముఖ్యమే కదా? కనీసం.. ఆ విషయం మీద అయినా మాట్లాడాలి కదా? ఆయన మీద కేసులు పెట్టాలి కదా? ఇవేమీ లేకుండా సభకు రాకుండా.. ముఖం చాటేయటం సమాధానం అయితే కాదు కదా? మాట్లాడే ప్రధాని మోడీ.. సంక్లిష్ట పరిస్థితుల్లో మౌనంగా ఉండటం సమస్యలకు సమాధానం కాదు.

Tags:    

Similar News