చంద్రబాబుకే అంత ప్రాధాన్యత దేనికి?

కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర టీడీపీ అధినేత చంద్రబాబుదే

Update: 2024-06-11 03:30 GMT

కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర టీడీపీ అధినేత చంద్రబాబుదే. ఎందుకంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. టీడీపీ ఈ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎంపీల పరంగా ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో సహజంగానే చంద్రబాబుకు కేంద్రంలో భారీ ప్రాధాన్యత లభిస్తోంది.

ఎన్డీయే కూటమి నేతల సమావేశంలోనూ, ఆ తర్వాత ఎన్డీయే కూటమి ఎంపీల సమావేశంలోనూ చంద్రబాబుకు ప్రధాని మోదీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. నరేంద్ర మోదీ పక్కన చంద్రబాబునే కూర్చోపెట్టుకున్నారు. చంద్రబాబు తర్వాత జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కు దక్కింది. జేడీయూ ఈ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.

కాగా కేంద్రంలో చంద్రబాబుకు ప్రాధాన్యత లభించడం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఊసరవెల్లి రంగులు మార్చినంత తేలికగా నితీశ్‌ కుమార్‌ కూటములు మారుస్తారనే అపప్రథ ఆయనపై ఉంది. ఐదేళ్ల వ్యవధిలోనే ఆయన ఎన్డీయే కూటమి.. ఇండియా కూటమి.. మళ్లీ ఎన్డీయే కూటమి.. ఇలా గోడ మీద పిల్లిలా దూకారు.

ఈ నేపథ్యంలో ఎప్పటికీ నితీశ్‌ నమ్మదగిన వ్యక్తి కాదనే అభిప్రాయంతో కమల దళం ఉందని అంటున్నారు. అసలు కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పాటుకు ముందుకొచ్చిందే నితీశ్‌ కావడం గమనార్హం. ఆయా పార్టీలను కాంగ్రెస్‌ గూటికి చేర్చడంలోనూ ఆయన మొదట కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎక్కడ ఏం బెడిసికొట్టిందో.. బీజేపీ కూటమికి సై అన్నారు. ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. దీంతో బిత్తరపోవడం కాంగ్రెస్‌ వంతైంది.

ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ తో వ్యవహారం అంత తేలిక కాదనే అభిప్రాయంతో బీజేపీ ఉందని అంటున్నారు. ఆయన ఏ క్షణమైనా ఇండియా కూటమిలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనేది బీజేపీ అభిప్రాయం అని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు చంద్రబాబు అలా కాదు. తొలిసారి బీజేపీకి చంద్రబాబు మద్దతు ఇచ్చిన 1999 నుంచి చంద్రబాబు కూటములు మార్చలేదు. ఐదేళ్లపాటు 1999లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 2004, 2009ల్లో బీజేపీతో కలిసి పోటీ చేయలేదు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా టీడీపీ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో 2018 చివరలో కేంద్ర ప్రభుత్వంలో నుంచి తప్పుకుంది. 2019లో ఒంటరిగా టీడీపీ పోటీ చేసింది.

ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీశ్‌ తో పోలిస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకే విశ్వసనీయత ఎక్కువ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో 16 ఎంపీ స్థానాలతో రెండో స్థానంలో ఉన్న టీడీపీకి అధిక ప్రాధాన్యత లభిస్తోందని చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలోనూ టీడీపీకి రెండు బెర్తులు దక్కాయి. ఇందులో ఒకటి కేబినెట్‌ మంత్రి కాగా, మరొకటి సహాయ మంత్రి. ఇంకో 10 బెర్తులు ఖాళీ ఉన్న నేపథ్యంలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరికొందరు టీడీపీ ఎంపీలకు చాన్సు లభిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News