మోడీ మంత్రం.. ఎన్నికలు ముందు సంచలన నిర్ణయాలు
ఇక, మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు ఎన్నికలకు ముందు.. ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుని తీరాలన్న కసితో ఉన్న మోడీ.. ఆదిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు అయోధ్య రామమందిరాన్ని తీసుకువచ్చారు. తర్వాత.. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇవి మేధావి వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నించిన యత్నాలు.
ఇక, మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించారు. గత ఏడాది కాలంగా పెట్రోల్ ధరలను తగ్గించకుండా.. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కు ముందు రూ.2 చొప్పున తగ్గించడం మోడీ మాయగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చిన సందర్భంలోనూ పెట్రోలు ధరలు తగ్గించలేదు. కానీ, రెండు రోజుల్లో షెడ్యూల్ వస్తుందని భావిస్తున్న సమయంలో మోడీ మాయాజాలం ప్రదర్శించడం గమనార్హం.
ఇక, మహిళలను ఆకట్టుకునేందుకు రెండు రోజులు కిందట వంట గ్యాస్ ధరలను రూ.100 తగ్గించడమే కాకుండా.. వెంటనే అమల్లోకి తెచ్చేశారు. నిజానికి ఎన్నికల్లో ఉచితాలకు తాము వ్యతిరేకమని.. తాయిలా లకు తాము రెడీగా ఉండమని చెప్పే మోడీ.. ఇదిమాత్రం తాయిలం కాదా ? అన్న ప్రతిపక్షాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన పాలన బాగున్నప్పుడు.. ఇలా తాయిలాలు ఇవ్వడం ఎందుకు..? అనేది ప్రశ్న. ఇది ప్రత్యక్ష తాయిలం కాకపోవచ్చు.
అయినప్పటికీ.. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రధాన విన్యాసం కావడం గమనార్హం. ఇక, షెడ్యూల్ రావడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇంకేం చేస్తారో చూడాలి. మరోవైపు.. ఈపాటి తెలివి కాంగ్రెస్‌కు లోపించడం గమనార్హం. 2014కు ముందు 480 రూపాయలు ఉన్న గ్యాస్ ధరలను తగ్గించాలని మిత్రపక్షాలు చెప్పినా.. తగ్గించేది లేదని భీష్మించి.. చేతులు కాల్చుకుంది. కానీ, మోడీ మాత్రం ఇన్నాళ్లు పిండేసి.. ఇప్పుడు అరకొరగా గ్యాస్‌పై రూ.100, పెట్రోల్‌పై రూ.2 తగ్గించడం గమనార్హం.
కొసమెరుపు ఏంటంటే.. మూడు నెలల తర్వాత.. ఇంతకు రెట్టింపు పెంచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు నిపుణులు.