ఇండస్ట్రీ ప్రజా సంక్షేమం వైపే ఉంటుంది... బాబు అరెస్ట్ పై నరేష్ కీలక వ్యాఖ్యలు!
"మార్టిన్ లూథర్ కింగ్" సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ నటుడు నరేష్ కి చంద్రబాబు అరెస్ట్ గురించిన ప్రశ్న ఎదురయ్యింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు అత్యంత రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకి చెందిన వారికి చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్ ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది!
అవును... చంద్రబాబు అరెస్ట్ పై రాఘవేంద్ర రావు, కేఎస్ రామారావు, అశ్వనీదత్ వంటి వారు బహిరంగంగానే బాబుకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు సూటిగా చెప్పాలనుకున్న విషయం చెప్పారు. సున్నితమైన విషయాలపైనా, రాజకీయాలపైనా, మతపరమైన విషయాలపైనా ఇండస్ట్రీ స్పందించదని తేల్చి చెప్పారు! ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు నరేష్ చంద్రబాబు అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
"మార్టిన్ లూథర్ కింగ్" సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ నటుడు నరేష్ కి చంద్రబాబు అరెస్ట్ గురించిన ప్రశ్న ఎదురయ్యింది. ఇందులో భాగంగా... చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా.. ఈ విషయంలో తాను ఏ ఒక్క నాయకుడి గురించో మాట్లాడను.. కానీ ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అని అన్నారు.
ఇదే సమయంలో... వ్యక్తిగత కక్షతో, అణచివేత ధోరణితో ఎవరిని అయినా బంధించడం ప్రజాస్వామ్యంలో ఒక తిరుగుబాటును సూచిస్తుందని, ఆ తిరుగుబాటు ఫలితం ఓటు రూపంలో వస్తుందని నరేష్ అన్నారు. అదేవిధంగా... ఎమర్జెన్సీ కూడా నల్ల మచ్చగా మిగిలిపోయిందని పేర్కొన్న ఆయన.. డబ్బుకీ రాజకీయానికీ చాలా చిక్కుముడులు పడిపోయాయని, అయితే ఆ ముడి విప్పాలని తెలిపారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు తర్వాత సినిమా వాళ్లు మౌనంగా ఉన్నారెందుకని ఎదురైన ప్రశ్నకు మరింత నర్మగర్భంగా స్పందించినంత పనిచేశారు నరేష్. ఇందులో భాగంగా.. సినీ పరిశ్రమ ఎప్పుడూ ప్రజా సంక్షేమం వైపే ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ గారి టైంలో కూడా వరదల్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జోలెపట్టుకుని డబ్బు సేకరించి ప్రజల్ని ఆదుకున్నామని గుర్తు చేశారు.
అదే విధంగా... ప్రజలకు సమస్య వచ్చినప్పుడు సినీ పరిశ్రమ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అయితే బాబు అరెస్టుకు సమాధానం ప్రజలే చెప్పాలని, అయితే తాము కూడా ప్రజల్లో భాగమే అని అన్నారు. ఇవాళ సైలెంట్ మార్పు జరుగుతోందని నరేష అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో... ఒకప్పుడు క్రియాశీల రాజకీయాల్లో తను చురుగ్గా పాల్గొన్నానని, ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని చెప్పిన నరేష్... ప్రస్తుతం రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా తిట్టుకుంటున్నారని, అలాంటి తిట్లను తాను తట్టుకోలేనని నరేష్ చెప్పుకొచ్చారు.