తెలంగాణ నుంచి రాజ్యసభకు జాతీయ కాంగ్రెస్‌ నేతల పోటీ!

ఈ నెల 15 వరకు నామినేషన్లు సమర్పించడానికి అవకాశం ఉంది.

Update: 2024-02-14 00:30 GMT

రాజ్యసభలో ఖాళీ అయిన సీట్ల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సీట్లకు భారీ ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 15 వరకు నామినేషన్లు సమర్పించడానికి అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ కోశాధికారి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మాకెన్‌ ను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. చివరి క్షణంలో మార్పులు లేకపోతే ఆయనకే టికెట్‌ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.

అజయ్‌ మాకెన్‌ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న పార్టీ సమావేశం కోసం అజయ్‌ మాకెన్‌ హైదరాబాద్‌ వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే అదే రోజు ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర కోటాలో రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అజయ్‌ మాకెన్‌ జనరల్‌ కేటగిరీకి చెందినవారు. దీంతో తెలంగాణ రాష్ట్ర కోటాలో బీసీలు లేదా ఎస్సీలకు టికెట్‌ ఇవ్వాలని యోచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంతరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ తదితరులు రాజ్యసభ సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు నాగయ్య, ఎస్సీల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ఆశిస్తున్నారు.

అద్దంకి దయాకర్‌ కు ఇటీవల ఎమ్మెల్సీ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో ఈసారి రాజ్యసభపైన ఆయన గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సైతం అసెంబ్లీ టికెట్‌ త్యాగం చేసిన అద్దంకి దయాకర్‌ కు న్యాయం చేయాల్సి ఉందని చెప్పడంతో ఈసారి ఆయనకు ఖాయమేనంటున్నారు.

మరోవైపు జనరల్‌ కోటాలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి తదితరులు కూడా రాజ్యసభ సీటు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మరి రాజ్యసభ బెర్త్‌ ఎవరికి దక్కుతుందో వేచిచూడాల్సిందే!

Tags:    

Similar News