నవీన్ కి ఉన్న హుందాతనం జగన్ కి అవసరం!?

రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజం.. ఇదే సమయలో నేతలకు హుందాతనం మరింత ముఖ్యం అని అంటారు.

Update: 2024-06-13 04:57 GMT

రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజం.. ఇదే సమయలో నేతలకు హుందాతనం మరింత ముఖ్యం అని అంటారు. ప్రధానంగా... గెలుపుపై విశ్లేషణలు అవసరం లేకపోయినా.. ఓటమిపై ఆత్మపరిశీలన ఎంత అవసరమో, దాన్ని హుందాగా తీసుకోవడం అంతే ముఖ్యం అని చెబుతుంటారు. ఈ క్రమంలో... ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాలా మందికి ఆదర్శం అని అంటున్నారు పరిశీలకులు.

మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాల్లో బీజేపీ 78 స్థానాల్లో గెల్లిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. సుమారు రెండున్నర దశాబ్ధాలుగా ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ను ఓడించింది. ఈ క్రమలో ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ మాఝి ప్రమాణస్వీకారం చేశారు.

ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రులుగా కనకవర్ధన్ సింగ్, ప్రభాతి పరిడ తో పాటు 8 మంది క్యాబినెట్ మంత్రులుగా, 5గురు స్వతంత్ర హోదా గల మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇలా ఒడిశాల్లో బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఏర్పడటంతో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు బీజేపీకి చెందిన పలువురు పెద్దలు హాజరయ్యారు.

ఇదంతా ఒకెత్తు అయితే... సీఎంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుమారు పాతికేళ్లుగా ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్ ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు సీఎం మాఝి. అయితే ఈ ఆహ్వానాన్ని అత్యంత పాజిటివ్ గా హుందాగా తీసుకున్న నవీన్ పట్నాయక్... ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రిని, కేబినెట్ ను అభినందించారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.

ఈ సమయంలో ఆయనను వేదికపైకి బీజేపీ నేతలు సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేసిన మోడీ... వేదికపై చాలా సేపు నవీన్ తో ముచ్చటించారు. దీనికి సంబందించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కారణం... ఎన్నికల ప్రచార సమయంలో నవీన్ పట్నాయక్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వాస్తవానికి ఈ రోజుల్లో రాజకీయాలు అంటే ప్రతీకారాలకు పెట్టిన పేరుగా ఉంటున్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రతీకారాలు తీర్చుకోవడం.. తిరిగి అధికారం కోల్పోయిన తర్వాత అవతలి పార్టీ నుంచి అదే సమస్యను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో... తన ప్రత్యర్థి పార్టీ నేత, తనకంటే వయసులో చిన్న వ్యక్తి ప్రమాణస్వీకారానికి నవీన్ పట్నాయక్ హాజరవ్వడంతో ఆయనపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

ఇలాంటి హుందాతనం రాజకీయాల్లో అవసరం అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఏపీలో వైఎస్ జగన్ కు నవీన్ పట్నాయక్ ఆదర్శం కావాలని చెబుతున్నారు. కారణం... తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్ కి స్వయంగా ఫోన్ చేసినా స్పందించలేదని వార్తలు వస్తున్నాయి!

Tags:    

Similar News