భారత్ ను చంద్రుడిపైకి ఎత్తేస్తున్న పక్కదేశ మాజీ ప్రధాని!
ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితికి పక్కనున్న దేశం అభివృద్ధి చెందడానికి గల కారణాలను చెప్పే పనికి పూనుకున్నారు.
భారతదేశాన్ని ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితికి పక్కనున్న దేశం అభివృద్ధి చెందడానికి గల కారణాలను చెప్పే పనికి పూనుకున్నారు. ఇదే సమయంలో భారత్ అభివృద్ధిని చూపిస్తూ పాక్ నాయకులను దెప్పిపొడిచే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, ఉగ్రవాద నిర్మూళన వంటి విషయాలపై స్పందించడం గమనార్హం.
అవును... ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్... పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలుమోపాయి కానీ... కానీ పాకిస్థాన్ మాత్రం భూమి మీదే నిలకడలేని స్థితిలో ఉన్నా అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో... "మన పతనానికి మనమే బాధ్యులం, అలాకపోతే ఈ దేశం మరో స్థాయిలో ఉండేది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగోసారి ప్రధాని పదవి కోసం పోటీ చేస్తున్న నవాజ్ షరీఫ్... 2013లో పాకిస్తాన్ కరెంట్ కష్టాలు ఎదుర్కొందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యని పరిష్కరించామని తెలిపారు. ఇదే సమయంలో దేశాభివృద్ధికి ప్రధాన ఆటంకం అయిన ఉగ్రవాదాన్ని దేశం నలుమూలల అంతం చేసి, శాంతిని పునరుద్ధరించామని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా... కరాచీలో హైవేలు నిర్మించామని, తమ ప్రభుత్వ హయాంలో పాక్ ప్రగతి పథంలో నడిచిందని తెలిపారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ లో మహిళల పరిస్థితిపై పరోక్షంగా స్పందించిన షరీఫ్.. వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితి కారణం అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా... అభివృద్ధి చెందిన ప్రతి దేశం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందని, కానీ పాక్ లో ఆ పరిస్థితి లేదని అన్నారు! ఇక.. అభివృద్ధిలో మహిళలు కూడా సమాన భాగస్వాములుగా ఉండాలని తాను భావిస్తున్నానని, వారుకూడా ఈ దేశ సేవలో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
ఇదే క్రమంలో... ప్రస్తుతం పాకిస్థాన్ లో నెలకొన్న సంక్షోభాలకు ఎవరిని నిందించాలని ప్రశ్నించిన నవాజ్ షరీఫ్... తన ప్రభుత్వ హయాంలో 2014లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండేదని చెప్పుకున్నారు. దేశం అభివృద్ధి చెందాలని ఆశిస్తే.. మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్హంగా పాక్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా ఇటీవల పాకిస్థాన్ లో మహిళల పరిస్థితి గురించి ఆ దేశ నటి ఆయేషా ఒమర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లో తనతో పాటు మహిళలందరికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కరువయ్యాయని కుండబద్దలు కొట్టింది. ఇక్కడి మహిళలు ప్రతి క్షణం భయపడుతూ నరకం చూస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సమయంలో నవాజ్ షరీఫ్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.