తెలంగాణలో ఈ-వెహికల్స్ కొనేవారికి ఇంతకంటే గుడ్ న్యూస్ ఉంటుందా?
రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు "ఈవీ నూతన పాలసీ"ని రుపొందించామని చెబుతూ.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.
‘కొత్త వాహనం ఏ కంపెనీది కోనుగోలు చేస్తారో మీ ఇష్టం.. విద్యుత్ తో నడిచే వాహనాన్ని మాత్రం కొనండి.. భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి రక్షించండి’ అంటూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు "ఈవీ నూతన పాలసీ"ని రుపొందించామని చెబుతూ.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.
అవును... విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా "ఈవీ నూతన పాలసీ"ని రూపొందించామని, ఈ సరికొత్త విధానం సోమవారం నుంచి అమలోకి వస్తుందని చెప్పిన పొన్నం ప్రభాకర్... ఈ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసినవారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం (నవంబర్ 18) నుంచి ప్రారంభమైన ఈ మినహాయింపు.. 2026 డిసెంబర్ 31 వరకూ రాష్ట్ర పరిధిలో జరిగే అన్ని విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్ కూ వర్తిస్తుందని మంత్రి అన్నారు. ఇదే సమయంలో... కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే.. వారికి కూడా రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తామని తెలిపారు.
ఈ మినహాయింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని వెల్లడించారు. వాస్తవానికి.. గత ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించిందని.. అయితే, తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తాజాగా తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్య పరిమితుల్ని ఎత్తేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఇదే సమయంలో... ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కొంటే వాహనదారు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాలని.. అయితే రెండో బండి ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారికి ఆ 2 శాతం అదనపు పన్ను మినహాయిస్తామని ఆయన పేర్కొన్నారు!