న్యూజెర్సీలో అతిపెద్ద హిందూ టెంపుల్... డేట్ ఫిక్స్!

హిందూ టెపుల్స్ భారత్ అవతల నిర్మితమైతే అది కచ్చితంగా గొప్ప విషయమే భావిస్తుంటారు పలువురు భారతీయులు

Update: 2023-09-25 06:46 GMT

హిందూ టెపుల్స్ భారత్ అవతల నిర్మితమైతే అది కచ్చితంగా గొప్ప విషయమే భావిస్తుంటారు పలువురు భారతీయులు. ఈ క్రమంలో ఈ ఆధునిక యుగంలో భారతదేశం వెలుపల ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించారు. అదేంటి ఇప్పటికే చాలా ఉన్నాయి కదా అంటే... ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం. అదే దీని ప్రత్యేకత!

అవును.. న్యూజెర్సీలో బీఏపీఎస్‌ అధ్యాత్మిక అధిపతి మహంత్‌ స్వామి మహరాజ్‌ ఆధ్వర్యంలో కంబోడియాలోని ఆంకోర్‌ వాట్‌ తర్వాత రెండో అతిపెద్ద హిందూ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని అక్టోబరు 8న లాంచనంగా ప్రారంభించనున్నట్లు బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ సంస్థకు చెందిన అక్షర్‌ వత్సలదాస్‌ వెల్లడించారు.

ఇందులో భాగంగా ఆ నెల 18వ తేదీ నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ప్రస్తుతం అధికారికంగా ప్రారంభోత్సవానికి ముందు వేలాది మంది హిందువులు, ఇతర మతాలకు చెందిన ప్రజలు సైతం ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. అక్షరధామ్‌ గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం 183 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

అయితే ఇది పురాతన హిందూ గ్రంథాల ప్రకారం రూపొందించబడిందని చెబుతున్నారు. 10,000 విగ్రహాలు, భారతీయ సంగీత వాయిద్యాలు, నృత్య రూపాలకు చెందిన శిల్పాలు పురాతన భారతీయ సంస్కృతికి అద్దంపట్టేవిగా రూపొందించబడ్డాయని అంటున్నారు.

ఇక, ప్రత్యేకమైన హిందూ దేవాలయ రూపకల్పనలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప - పుణ్యక్షేత్రాలు, తొమ్మిది శిఖరాలు, తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. అక్షరధామ్‌ లో ఇప్పటివరకు నిర్మించబడిన సాంప్రదాయ రాతి వాస్తుశిల్పానికి చెందిన అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం ఉంది. అయితే దీన్ని వెయ్యి సంవత్సరాలు ఉండేలా రూపొందించారు.

అక్షరధామ్‌ లో ప్రతి రాయికి ఒక కథ ఉంటుంది. ఎంచుకున్న నాలుగు రకాల రాయిలో సున్నపురాయి, గులాబీ ఇసుకరాయి, పాలరాయి, గ్రానైట్ ఉన్నాయి. ఇవి తీవ్రమైన వేడి, విపరీతమైన చలిని తట్టుకోగలవు. దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయి ఈ నిర్మాణంలో ఉపయోగించబడింది!

కాగా... కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది 12వ శతాబ్దపు నాటిదని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది. మరోపక్క నవంబర్ 2005లో న్యూ ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం 100 ఎకరాల్లో విస్తరించి ఉంది.

Tags:    

Similar News