101 మంది విదేశీయులకు ఉరి... భారత్ నుంచి ముగ్గురు!
కారణాలు ఏవైనప్పటికీ ఇటీవల కాలంలో ఉరిశిక్షలు అమలు తీర్పులు ఎక్కువైపోతున్నాయని అంటున్నారు.
కారణాలు ఏవైనప్పటికీ ఇటీవల కాలంలో ఉరిశిక్షలు అమలు తీర్పులు ఎక్కువైపోతున్నాయని అంటున్నారు. ఇక పలు అరబ్ కంట్రీస్ సంగతి చెప్పే పనిలేదు అనే కామెంట్లూ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో గత రెండేళ్లుగా అమలవుతున్న ఉరిశిక్షలకు సుమారు మూడురెట్లు 2024లో అమలయ్యాయి. ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
అవును... సౌదీ అరేబియాలో ఈ ఏడాది 100 మందికి పైగా విదేశీయులను వివిధ నేరాల కింద ఉరితీశారని ఏ.ఎఫ్.పీ వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈ సంఖ్య సుమారు మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది. డ్రగ్స్ సంబంధిత నేరాలే దీనికి ప్రధాన కారణం అని అంటున్నారు. తాజాగా యెమెన్ దేశానికి చెందిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయడంతో ఈ సంఖ్య 100 దాటింది.
నాజ్రాన్ లోని ఈశాన్య ప్రాంతంలో యెమెన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడంట. దీంతో.. తాజాగా అతడిని ఉరి తీసినట్లు సౌదీ మీడియా వెల్లడించింది. దీంతో... సౌదీలో ఉరి తీయబడిన విదేశీయుల సంఖ్య 101కి చేరిందని అంటున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో ప్రతీ ఏడాది 34 మంది విదేశీయులను ఉరి తీశారు.
ఈ సందర్భంగా స్పందించిన బెర్లిన్ కు చెందిన యూరోపియన్-సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ లీగల్ డైరెక్టర్ తహా అల్ - హజ్జీ స్పందిస్తూ... ఒక ఏడాదిలో విదేశీయులకు మరణశిక్షలు అమలులో ఇదే అత్యధికం అని.. సౌదీ అరేబియా గతంలో కూడా 100 మంది విదేశీయులకు ఉరిశిక్ష విధించలేదు అని అన్నారు.
తాజా నివేదిక ప్రకారం... ఈ ఏడాది ఉరితీయబడిన విదేశీయులలో పాకిస్థాన్ నుంచి 21 మంది ఉండగా.. యెమెన్ నుంచి 20, సిరియా నుంచి 14, నైజీరియా 10, ఈజిప్ట్ 9, జోర్డాన్ 8, ఇథియోఫియా 7గురూ ఉన్నారు. ఇక భారత్, సూడాన్, ఆఫ్గాన్ నుంచి ముగ్గురేసి చొప్పున.. శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఎరిట్రియా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు!
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం... 2023లో చైనా, ఇరాన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఖైదీలను ఉరి తీసింది సౌదీ అరేబియా! అంటే... ఈ జాబితాలో నాడు థర్డ్ ప్లేస్ అన్నమాట. అయితే ఈ ఏడాదిలో మాత్రం రికార్డ్ స్థాయిలో 274 మందిని ఉరి తీసింది. 2022 (196), 1995 (192) లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ!