బడ్జెట్ లోపే కొత్త మంత్రులు.. ఒకరిద్దరికి బంపరాఫర్?

దీంతోపాటు ఖాళీగా ఉన్న స్ధానాల్లో ఇప్పటివరకు స్థానం దక్కని జిల్లాలు, సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని చూస్తున్నట్లుగా తెలిసింది. మలి విడతలో కొన్ని కొత్త ముఖాల పేర్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-01-21 14:30 GMT

తెలంగాణలో కొత్త ప్రభుత్వం తన కార్యాచరణను వేగిరం చేస్తోంది.. ఒక్కోటిగా పథకాలు చేపడుతూ తనదైన శైలిలో ముందుకెళ్తోంది. మంత్రులు సైతం స్వేచ్ఛగా వ్యవహరిస్తూ తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. అయితే, పూర్తిస్థాయి మంత్రివర్గం మాత్రం ఇంకా కొలువుదీరలేదు. ముఖ్యమంత్రితో కలుపుకొని మంత్రివర్గంలో 18 మందికి చాన్స్ ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు ఖాళీలున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతానికి మంత్రి లేరు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్కటే సీటు గెలవడం, సామాజిక సమీకరణాల ప్రకారం ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో తొలి విడతలో ఎవరికీ చాన్స్ ఇవ్వలేదు.

మలి విడతలో ఖాయం

వచ్చే లోక్ సభ ఎన్నికలకు పూర్తిస్థాయి మంత్రివర్గంతో వెళ్లేందుకే సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకనే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఖాళీగా ఉన్న స్ధానాల్లో ఇప్పటివరకు స్థానం దక్కని జిల్లాలు, సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని చూస్తున్నట్లుగా తెలిసింది. మలి విడతలో కొన్ని కొత్త ముఖాల పేర్లు వినిపిస్తున్నాయి.

ఆరులో మూడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు

ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో ఎస్టీ, బీసీ, ఎస్సీలకు ఒక్కోటి చొప్పున ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఎస్టీ కోటా బాలూ నాయక్, ఎస్సీ విభాగంలో వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. వాకిటి శ్రీహరి (మక్తల్), ఈర్లపల్లి శంకర్ (షాద్ నగర్)లకు బీసీ కోటాలో చోటిస్తారని పేర్కొంటున్నారు. రెడ్డి వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (నల్లగొండ), మల్ రెడ్డి రంగారెడ్డి (గ్రేటర్ హైదరాబాద్), సుదర్శన్ రెడ్డి (నిజామాబాద్)లలో ఒకరికి బెర్తు ఖాయమంటున్నారు. హైదరాబాద్ లో గెలిచిన ఏకకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి. నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరికీ చాన్స్ రాలేదు. వెలమల కోటాలో ఇప్పటికే జూపల్లి ఉండగా.. ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ ల పేర్లు చెబుతున్నారు.

ఎన్ఎస్ యూఐ నేతకు బంపర్ ఆఫర్

ఎన్ఎస్ యూఐ నాయకుడు ఒకరిని రాహుల్ గాంధీ నేరుగా సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. అతడికి బంపర్ ఆఫర్ తరహాలో మంత్రి పదవి దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఆ ఎన్ఎస్ యూఐ నేత ఎవరనేది మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు. వాస్తవానికి కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్ యూఐ.. ఆ పార్టీ యువజన విభాగం కంటే తక్కువ స్థాయి. అయితే, రాహుల్ సిఫార్సుతో ఎన్ఎస్ యూఐ నాయకుడికే మంత్రి పదవి రానుండడం విశేషమే. అతడు ఎవరనేది చూడాలి. మొత్తానికి 15 రోజుల్లోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్నారు.

Tags:    

Similar News