నిర్మ‌ల‌మ్మ ఫ్రీ స‌జెష‌న్‌: మీకు క‌ష్టాలున్నాయా.. వారికి మొర పెట్టుకోండి!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్‌.. త‌ర‌చుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. జీఎస్టీ మాత్ర‌మే కాదు.. ప‌లు కీల‌క నిర్ణ‌యాల విష‌యంలోనూ నిర్మ‌లా సీతారామ‌న్ ట్రోల్స్‌కు గుర‌వుతున్నారు.

Update: 2025-02-04 09:30 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్‌.. త‌ర‌చుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. జీఎస్టీ మాత్ర‌మే కాదు.. ప‌లు కీల‌క నిర్ణ‌యాల విష‌యంలోనూ నిర్మ‌లా సీతారామ‌న్ ట్రోల్స్‌కు గుర‌వుతున్నారు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జ‌టె్ విష‌యంలోనూ ఇలానే ఆమె దొరికిపోయారు. 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లో బిహార్‌కు మిన‌హా ఇత‌ర రాష్ట్రాల‌కు ఆశించిన మేర‌కు నిధులు కేటాయించ‌లేద‌న్న వాద‌న వినిపించింది. దీంతో త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, బీజేపీ పాలిత యూపీ వంటివి కేంద్ర ఆర్థిక శాఖ‌కు లేఖలు సంధించాయి.

త‌మ‌ను కూడా ప‌ట్టించుకోవాలంటూ.. లేఖ‌ల్లో త‌మ డిమాండ్ల‌ను కూడా వినిపించాయి. అదేస‌మ‌యంలో గ‌త బ‌డ్జెట్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు కేటాయిస్తామ‌ని హామీలు ఇచ్చి కూడా ఏమీ చేయ‌ని అంశాల‌ను పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక క‌ష్టాల‌ను కూడా వివ‌రించాయి. ముఖ్యంగా జీఎస్టీ(పన్నుల) సొమ్ములో కేంద్రం తమకు న్యాయమైన వాటా ఇవ్వడం లేదని రాష్ట్రాలు ఆరోపించాయి. ఇలా అయితే.. రాష్ట్రాల‌ను నెట్టుకురావ‌డం క‌ష్ట‌మ‌ని కూడా తేల్చి చెప్పాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీల‌క‌ సూచన చేశారు. త‌మ‌కు క‌ష్టాలు ఉన్నాయ‌ని భావిస్తున్న‌ రాష్ట్రాలు 16వ ఆర్థిక సంఘానికి తమ అభ్యంతరాలను తెలియజేయాలని సలహా ఇచ్చా రు. కమిషన్‌ సిఫారసుల ప్రకారమే నిధుల పంపిణీ జరుగుతుందని, రాష్ట్రాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోబోమని తెలిపారు. అయితే.. ఇది మ‌రింత వివాదానికి కార‌ణ‌మైంది. ఇటీవ‌ల 16వ ఆర్థిక సంఘం చైర్మ‌న్ ప‌న‌గాడియా.. మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం సూచించిన మేర‌కు త‌మ నివేదిక‌లో విష‌యాలు ఉంటాయ‌న్నారు.

ఇత‌మిత్థంగా ఆయ‌న ఇవీ.. అని చెప్ప‌క‌పోయినా.. కేంద్రం పేర్కొన్న అంశాల ప్ర‌కార‌మే తాము ప‌నిచేస్తామ ని, త‌మ సొంత నిర్ణ‌యాలు ఉండ‌బోవ‌న్న ధోర‌ణిని వివ‌రించారు. కానీ, ఇప్పుడు నిర్మ‌లా సీతారామ‌న్ మాత్రం ఆర్థిక సంఘానికి మొర పెట్టుకోవాల‌ని చెప్పారు. దీంతో రాష్ట్రాలు మండిప‌డుతున్నాయి. ఆర్థిక సంఘం చెప్పిన‌ట్టు కేంద్రం చేస్తుందా? అయితే.. ఒక‌టి రెండు రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చినా ఇబ్బంది లేద‌న్న నిర్ణ‌యాన్ని ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని ఆయా రాష్ట్రాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఇది త‌ప్పుకొనే ధోర‌ణి, త‌ప్పించుకునే ధోర‌ణి అంటూ.. మండి ప‌డుతున్నాయి. నిర్మ‌ల‌మ్మ ఉచిత స‌ల‌హాపై నిప్పులు చెరుగుతున్నారు.

Tags:    

Similar News