విమానం మాదిరి బస్సులు... భారత్ లో తొలుత ఎక్కడంటే..?
ఈ స్పెషల్ బస్సుల్లో విమానం మాదిరిగానే సీట్లు, బస్ హోస్టెస్ ఉంటారని పేర్కొన్నారు.
సీట్ల ముందు ల్యాప్ టాప్ పెట్టుకోవడానికి ప్లేసు, లగ్జరీ సీట్లు, ఎయిర్ కండిషన్ లతో పాటు ప్రయాణికులకు పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, డ్రింక్స్, మొదలైనవి అందజేయడానికి హోస్టెస్ లు! ఏమిటి ఇవన్నీ.. విమానంలో ఉండే సౌలభ్యాలు కదా అనుకుంటే పొరపాటే! ఈ సౌలభ్యాలతో భారత్ లో త్వరలో బస్సులు తిరగబోతున్నాయి. తాజాగా ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
అవును... సుమారు 132 సీట్లతో భారీ బస్సు! అందులో విమానంలో ఎయిర్ హోస్టెస్ మాదిరిగా బస్ హోస్టెస్ ఉంటారు.. అవసరమైన ఆహార పదార్థాలు అందిస్తుంటారు! ఈ స్థాయి సౌకర్యాలతో బస్సులు భారత్ లోని రోడ్లపై తిరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ జాతీయ మీడియా అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నితిన్ గడ్కరీ... త్వరలో రాబోయే కొత్త తరహా బస్సులకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... 132 సీట్ల సామర్థ్యంతో సరికొత్త బస్సు రూపకల్పన జరుగుతోందని అన్నారు. నాగ్ పూర్ లో చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ స్పెషల్ బస్సుల్లో విమానం మాదిరిగానే సీట్లు, బస్ హోస్టెస్ ఉంటారని పేర్కొన్నారు. వీటిని పెట్రోల్, డీజిల్ తో కాకుండా పర్యావరణహితమైన ఇంధనం సాయంతోనే నడపనున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికోసం కిలోమీటర్ కు రూ.35 - 40 ఖర్చు అవుతుందని వెల్లడించారు. టాటా సంస్థతో కలిసి నాగ్ పూర్ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు గడ్కరీ తెలిపారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటికే 300 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిందని.. మరోపక్క ఆటో మొబైల్ కంపెనీలు పర్యావరణహిత వాహనాలను తయారుచేస్తున్నాయని ఫలితంగా డబ్బులు కూడా ఆదా అవుతాయని అన్నారు. ఉదాహారణకు లీటర్ డీజిల్ కు రూ.120 ఖర్చయితే.. ఇథనాల్ కేవలం రూ.60 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు.
ఇదే సమయంలో... ప్రజారవాణా వ్యయాన్ని తగ్గించడంపైనా దృష్టి పెట్టమని చెప్పిన గడ్కరీ... డీజిల్ తో నడిచే బస్సుకు కిలోమీటర్ కు రూ.115 ఖర్చు అయితే... ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు రూ.41, నాన్ ఏసీ బస్సుకు రూ.37 ఖర్చవుతుందని అన్నారు. దీనివల్ల ప్రజలపై టిక్కెట్ భారం కూడా సుమారు 15 నుంచి 20 శాతం తగ్గుతుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.