మోడీపై గుస్సా: బీజేపీపై నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ వర్గంగా మెజారిటీ నాయకులు ఉన్న విషయం తెలిసిందే
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ వర్గంగా మెజారిటీ నాయకులు ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ వర్గంగా మరికొందరు నాయకులు కూడా ఉన్నారు. అయితే.. తన వర్గాన్నిఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్న ప్రధాని మోడీ.. ఆర్ ఎస్ ఎస్ వర్గంగా ముద్రపడిన వారిని పక్కకు తప్పిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీని మాత్రం ఆయన తప్పించలేక పోతున్నారు. బలమైన ఆర్ ఎస్ ఎస్ మద్దతు ఉన్న నాయకుడు కావడం, మహారాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుండడంతో నితిన్ గడ్కరీ తనకు సెగ పెడతారని తెలిసినా.. ఆయనను మాత్రం తప్పించే ప్రయత్నం చేయలేక పోతున్నారు.
అయితే.. మోడీని మిగిలిన నాయకులు పొగిడినట్టు గడ్కరీ పొగడరు. పైగా.. మోడీ విధానాలను, ఆయన అనుసరిస్తున్న పాలనా తీరును కూడా.. గడ్కరీ పలు సందర్భాల్లో పరోక్షంగా ఎండగట్టారు. కరోనా సమయంలో ``ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది`` అని అన్నారు. `అగ్నివీర్` స్కీమ్‌ను తెచ్చినప్పుడుకూడా.. సూటి వ్యాఖ్యలు చేశారు. ఇలా తరచుగా మోడీ నిర్ణయాలను గడ్కరీ పరోక్షంగా విమర్శిస్తున్నారు. తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలతో గడ్కరీ విరుచుకుపడ్డ తీరు మోడీ వర్గంలో కలకలం రేపింది. ``బీజేపీ ఎటు పోతోందో కూడా అర్ధం కావడం లేదని కొందరు నాకు చెప్పారు. నేను ఎలా స్పందించాలో అర్ధం కాలేదు`` అని వ్యాఖ్యానించారు.
అంతటితో కూడా ఆగని గడ్కరీ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ``బీజేపీ అంటే భిన్నమైన పార్టీ అని అద్వానీ చెప్పేవారు. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సహించలేకే.. బీజేపీకి ప్రజలు అండగా ఉన్నారు. అందుకే వరుసగా మూడు ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుతున్నా. అదేసమయంలో కాంగ్రెస్ చేసిన తప్పులనే మన పార్టీ కూడా చేస్తే.. ఎలా అన్న ప్రశ్నలు వస్తే.. చేయకూడదని చెబుతున్నా. కాంగ్రెస్ చేసిన పనినే మనం కూడా కొనసాగిస్తే, వారికి మనకు తేడా ఏంటి? వారు అధికారం నుంచి నిష్క్రమించినా.. మనం అధికారంలోకి వచ్చినా ప్రయోజనం ఉండదు`` అని గడ్కరీ సూటిగా వ్యాఖ్యానించారు.
దీనిని బట్టి మోడీపై ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్ధమవుతుంది. చిత్రం ఏంటంటే.. శనివారం ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ప్రొటోకాల్ ప్రకారం.. ఇదే రాష్ట్ర కేంద్ర మంత్రిగా గడ్కరీ ఆయనను రిసీవ్ చేసుకోవాలి. కానీ.. గడ్కరీ అసలు రాష్ట్రంలోనే లేకుండా గోవాలో పర్యటించడం గమనార్హం.