కొత్త సర్వే... ముక్క లేకపోతే ముద్ద దిగని వారి సంఖ్య పీక్స్!
దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు, ఆహారపు అలవాట్లు, మాంసాహారం, శాఖహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకున్నారంట.
భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ముక్కలేనిదే ముద్దదిగని వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది! కార్యక్రమం ఏదైనా విందులో ముక్క ఉండాల్సిందే... మాంసం లేని మెనూను పక్కన వేయాల్సిందే అంటున్నారంట. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముక్క లేకుండా ముద్ద దిగని వారి సంఖ్య 96శాతం ఉండటం గమనార్హం. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాంసహారుల సంఖ్యపై “స్టాటిక్ ఆఫ్ ఇండియా” ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
అవును... మాంసాహారం అలవాటవ్వాలే కానీ... పంటి కింద ఆ ముక్క పడకపోతే ముద్ద దిగదనేవారే ఎక్కువ! ఈ క్రమంలో వీరి సంఖ్య లక్షద్వీప్ లో 100శాతం ఉండగా... తర్వాతి స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని స్టాటిక్ ఆఫ్ ఇండియా చెబుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో 99శాతం మంది మాంసహారులు ఉండగా... కేరళలో 98శాతం, పుదుచ్చేరిలో 97శాతం, తమిళనాడులో 96.4 శాతం... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 96శాతం మంది మాంసాహార ప్రియులు ఉన్నారట.
దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు, ఆహారపు అలవాట్లు, మాంసాహారం, శాఖహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకున్నారంట. ఈ జాబితాలో పైన చెప్పుకున్న ప్రాంతాలు టాప్ ప్లేస్ లో ఉండగా... అత్యల్పంగా రాజస్థాన్ లో కేవలం 32.4శాతం మంది మాత్రమే మాంసాహారులు ఉన్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో తాజా నివేదిక ప్రకారం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా నూటికి 70 మంది మాంసాహారులు ఉండగా... తెలుగు రాష్ట్రాల్లో వారి సంఖ్య నూటికి 96గా ఉండటం గమనార్హం. 18 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీ, పురుషులతో కలిసి సర్వే చేయగా.. జాతీయ సగటు కంటే 20శాతం ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాంసం తినేవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది!
ఇదే సమయంలో దేశంలో ఏటా మాంసం వినియోగం పెరుగుతుందని నివేదిక చెబుతుంది. తాజా లెక్కల ప్రకారం 2015 - 16లో 74శాతం మంది మాంసాహారులు ఉండగా.. 2019-21 నాటికి ఆ సంఖ్య ఏకంగా నాలుగు శాతం పెరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వారం నుంచి 15 రోజుల లోపు ఒక్కసారైనా పంటికింద ముక్క పడాల్సిందే అని చెబుతున్నారంట.