కిమ్ మరో కవ్వింపు చర్య... ఎవరికి ఏ సంకేతాలు ఇచ్చినట్లు?
అవును... యోంగ్ బ్యోన్ లో ఉన్న ఉత్తర కొరియా ప్రధాన అణు ఉత్పత్తి కేంద్రాన్ని ఆ దేశ నియంత కిమ్ జోంగ్ తాజాగా పరిశీలించారు.
తనదైన వ్యవహారాలతో అటు దాయాదీ దక్షిణ కొరియా, అగ్రరాజ్యం అమెరికాలతో పాటు ప్రపంచ దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన ఓ ఫోటో, వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్న కిమ్... అణ్యాయుధాల సంఖ్యను భారీగా పెంచాలని సూచించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... యోంగ్ బ్యోన్ లో ఉన్న ఉత్తర కొరియా ప్రధాన అణు ఉత్పత్తి కేంద్రాన్ని ఆ దేశ నియంత కిమ్ జోంగ్ తాజాగా పరిశీలించారు. ఈ మేరకు ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఇదే సమయంలో అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారని తెలిపింది. ఇది కచ్చితంగా అమెరికా, దక్షిణకొరియాలపై ఒత్తిడి పెంచే పనే అనే కామెంట్లు దీంతో మొదలయ్యాయి.
ఇలా యురేనియం శుద్ధీకరణకు సంబంధించి ఫోటోలు బహిరంగంగా బహిర్గతం చేయడం అంటే... అది కచ్చితంగా అగ్రరాజ్యాన్ని, దాని మిత్రదేశాలను, దాయాదీ దేశంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగమని ఈ సందర్భంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఉత్తర కొరియా అణు సంపత్తి ఏ స్థాయిలో ఉందో ప్రపంచం అంచనా వేసుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా విడుదలైన ఫోటోలలో... కిమ్ జోంగ్ నడుస్తున్న ప్రదేశంలో పొడవైన గొట్టాల వరుసలు ఉన్నట్లు కనిపించింది. ఈ సమయంలో ఆత్మరక్షణలో భాగంగా అణ్వాయుధాల సంఖ్యను వేగంగా పెంచాలని కిమ్ జోంగ్ ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.
ప్రస్తుతం ప్రపంచ మొత్తం రష్యా - ఉక్రెయిన్, ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధంపై దృష్టి సారించిన తరుణంలో కిమ్ ఇలా తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించినట్లు చెప్పడంతో పాటు.. దానికి సంబంధించిన ఫోటోలూ విడుదల చేయడం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశంపై ఒత్తిడి పెంచాలనేది లక్ష్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా... ఉత్తరకొరియా తొలిసారిగా 2010లో యోంగ్ బ్యోన్ లోని యురేనియం శుద్ధి కేంద్రాన్ని తొలిసారిగా బయట ప్రపంచానికి చూపించిన సంగతి తెలిసిందే. అప్పటిలో ఈ ప్లాంట్ ను అమెరికా ప్రతినిధుల బృందం సందర్శించింది కూడా. అయితే... తాజాగా కిమ్ సందర్శించిన కేంద్రం ఈ కాంప్లెక్స్ లోనిదా కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరో కేంద్రాన్ని మొదలుపెట్టారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది!