భారీగా ఎన్నారై గోల్డ్‌... ఏం జరిగింది.. ఏమైంది?

బ్యాంకు నుంచి ఈ నగలు తీసుకుని పార్థ కారులో వస్తుండగా ఆయనను అనుసరించిన దొంగలు ఆయనను చాకచక్యంగా బోల్తా కొట్టించి నగలను దోచుకున్నారు.

Update: 2024-09-10 06:13 GMT

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయులు ఎక్కువగా నివాసం ఉంటారనే విషయం తెలిసిందే. గూగుల్, సిస్కో, ఫేస్‌ బుక్‌ తదితర ప్రధాన కార్యాలయాలన్నీ కాలిఫోర్నియా, దాని సమీప ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లుగా పనిచేసే భారతీయులంతా కాలిఫోర్నియా, దాని సమీప ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ముఖ్యంగా తెలుగువారు కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌ లో నివాసం ఉంటారు.

ఈ క్రమంలో ఫ్రీమాంట్‌ లో నివాసం ఉంటున్న పార్థ తిరుమలై అనే వ్యక్తికి అనుకోని కష్టం వచ్చి పడింది. బ్యాంకులో ఉంచిన నగలను ఆయన తీసుకెళ్తుండగా దొంగలు వాటిని దోచుకున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 23న మౌరీ అవెన్యూలోని చేజ్‌ బ్యాంక్‌ లోని తన సేఫ్టీ డిపాజిట్‌ బాక్స్‌ నుండి పార్థ రెండు బ్యాగుల నగలను తీసుకున్నాడు. ఈ నగల్లో ఆయన పూర్వీకుల నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి.

బ్యాంకు నుంచి ఈ నగలు తీసుకుని పార్థ కారులో వస్తుండగా ఆయనను అనుసరించిన దొంగలు ఆయనను చాకచక్యంగా బోల్తా కొట్టించి నగలను దోచుకున్నారు.

పార్థ తిరుమలై బ్యాంకుకు వెళ్లినప్పటి నుంచే దొంగల ముఠా ఆయనను గమనిస్తూ ఉంది. ఈ విషయాన్ని ఆయన గమనించలేదు. బ్యాంకు నుంచి వస్తూ ఆయన దారిలో పోస్టాఫీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో తన హోండా కారు కిటికీ అద్దాన్ని పగలకొట్టి దొంగలు నగలు ఎత్తుకుపోయారు.

ఈ ఘటనపై పార్థ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని ఉపయోగించి అనుమానితుల వాహనం, వారి ప్రయాణాన్ని ట్రాక్‌ చేశారు. ఒక రోజు తర్వాత కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ అధికారులు దొంగలను పట్టుకుని ఆ నగలను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అనుమానితులైన గ్వాడలుపే డెల్‌క్రిస్టో మార్టినెజ్, కరోలినా మెడినా కోర్టెస్‌పై దొంగతనం చేసినట్టు కేసు నమోదు చేశారు.

అయితే పార్థ చేతికి పూర్తి నగలు రాలేదు. పోయినవాటిలో కొంత వరకు తిరిగి ఆయన చేతికి వచ్చాయి. దీంతో ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ కొంత మేరకైనా తన నగలను తన వద్దకు చేర్చినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News