బాబుకు సెక్యూరిటీగా ఉండే బ్లాక్ క్యాట్స్.. 52 రోజులుగా ఎక్కడున్నారు?
52 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన.. తనకు భద్రతగా ఉండే ఎన్ఎస్ జీ కమాండోల పర్యవేక్షణలో జైలు నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చారు.
స్కిల్ స్కాం ఆరోపణలతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ (తాత్కాలిక) రావటం.. ఆయన విడుదల కావటం తెలిసిందే. కోర్టు నుంచి ఆదేశాలుజారీ అయిన కొన్ని గంటలకే జైలు నుంచి బయటకు వచ్చారు. 52 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన.. తనకు భద్రతగా ఉండే ఎన్ఎస్ జీ కమాండోల పర్యవేక్షణలో జైలు నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చారు.
జైలుకు వెళ్లిన సందర్భంగా ఇన్నాళ్లు.. ఎన్ఎస్ జీ కమాండోలు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? కోర్టు ఆదేశాల అనంతరం వారు వెంటనే విధుల్లోకి ఎలా హాజరయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాచారం వెలుగు చూస్తుంది. స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టు అయిన చంద్రబాబు జైలుకు వెళ్లే వరకు ఆయనకు భద్రతగా ఉన్న ఎన్ఎస్ జీ కమాండోలు.. జైలు అధికారులకు అప్పగించిన తర్వాత రాజమహేంద్రవరంలోనే ఉండిపోయారు.
మొదటి నెల రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు హోటల్ లో బస చేశారు. అనంతరం లాలా చెరువు సమీపంలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. చంద్రబాబు ఏ క్షణంలో జైలు నుంచి విడుదలైనా.. ఆయనకు భద్రత కల్పించేందుకు వీలుగా షిప్టుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ క్షణంలో అయినా చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించేందుకు వారు రెఢీగా ఉండేవారు.
చంద్రబాబుకు బెయిల్ వచ్చిందన్న సమాచారం అందుకున్న వెంటనే.. వారు తమ వాహనశ్రేణిలో రాజమహేంద్రవరం జైలు ఆవరణకు వచ్చారు. చంద్రబాబును తమకు అప్పగించాలని కోరుతూ కోర్టు మంజూరు చేసిన పత్రాల్ని జైలు సిబ్బందికి సమర్పించారు. దీంతో.. రెండు ఎన్ ఎస్ జీ వాహనాల్ని జైలు అధికారులు అనుమతించారు. చంద్రబాబును చూసేందుకు జైలు వద్దకు వేలాది మంది రావటంతో.. మిగిలిన వాహనాలు లోపలకు వెళ్లటం కష్టంగా మారింది.
దీంతో.. తన కమాండ్ లతో పాటు కలిసి జైలు బయటకు నడుచుకుంటూ వచ్చిన చంద్రబాబు.. తనను చూసేందుకు వేలాదిగా జైలు వద్దకు వచ్చిన ప్రజలకు అభివాదం తెలిసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేలాదిగా ప్రజలు రావటంతో జైలు ఆవరణ మొత్తం ప్రజలతో నిండింది. దీంతో.. జైలు లోపలకు వాహనాల్ని బయటకు పంపే వీల్లేకుండా పోయింది.