అక్కినేనిని కలుసుకుందామని పిలిచి ఎన్టీయార్ అలా...!?
ఇద్దరూ చాలా సేపు పాత విషయాలు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీయార్ అక్కినేనిని తన ఇంటికి పిలిచారు.
ఎన్టీయార్ అన్న మూడు అక్షరాలలో ఎంతో పవర్ ఉంది. ఆయన జీవించినది డెబ్బై మూడేళ్ళు. కానీ ఆయన కీర్తి అజరామరం. ఎన్టీయార్ గురించి చెప్పుకోవాలంటే పేజీలు సరిపోవు. కాలం కూడా అంతకంటే సరిపోదు, ఆయన లాంటి మనిషి ఈ భూమి మీద నడయాడాడా అన్నది భవిష్యత్తు తరాలకు కూడా ఆశ్చర్యమే. ఆయనలో పట్టుదలకు కొలమానం లేదు. ఆయన ఏకసంధాగ్రాహి. అలాగే ఆనాడు వందల మంది బ్రిటిష్ ప్రభుత్వంలో పెట్టిన పరీక్షకు హాజరైతే అందులో ఎంపిక అయిన ఏడుగురులో ఒకరు ఎన్టీయార్. అలా సబ్ రిజిష్టార్ పోస్ట్ లో ఆయన పనిచేసారు.
ఇక సినిమాల్లో కూడా ఎన్టీయార్ ది ఒక శకం. ఆయన నటుడిగా చేయని పాత్ర లేదు వేయని వేషం లేదు. పౌరాణికాలకు పెట్టింది పేరు. ఆయన చారిత్రాత్మక చిత్రాలలో ప్రాణం పెట్టి పాత్రధారణ చేశారు. అలాగే సాంఘిక చిత్రాలలో ఆయన రికార్డు మరో ఎత్తు. జానపద చిత్రాలలో ఎన్టీయార్ బాణి ప్రత్యేకం.
ఇలా ఎన్టీయార్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎన్టీయార్ సడెన్ గా రాజకీయాల్లోకి వచ్చారు అని అంతా అనుకుంటారు. కానీ ఆయన తొలి నుంచి కూడా ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. 1950 దశకం నుంచే ఆయనలో ప్రజలకు ఏదో చేయాలని తపన ఉండేది. ఆయన రాయలసీమ క్షామానికి చలించి జోలె పట్టి మరీ విరాళాలు సేకరించి ఇచ్చారు.
ఇక ఎన్టీయార్ ప్రతీ సినిమాలో ఉత్తమమైన సందేశం ఉండేది. అలాగే ఆయన సినిమాల్లో పాటలు కూడా ఎంతో స్పూర్తివంతంగా ఉండేవి. దేశభక్తి గీతాలు కానీ ఉత్తేజపూరితమైన గీతాలు కానీ కచ్చితంగా ఒక్కటి అయినా సినిమాల్లో ఉండేలా చూసుకునేవారు. ఎన్టీయార్ ది పద్నాలుగేళ్ల రాజకీయ జీవితం. ఇందులోనే ఏడున్నరేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. మిగిలిన కాలం అయన విపక్షంలో ఉన్నారు.
ఇక ఎన్టీయార్ 1996 జనవరి 18న మరణించారు. దాని కంటే ముందు రోజు ఆయన అక్కినేని నాగేశ్వరరావుతో ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరూ చాలా సేపు పాత విషయాలు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీయార్ అక్కినేనిని తన ఇంటికి పిలిచారు. ఇద్దరూ కలసి భోజనం చేయాలని అనుకున్నారని చెబుతారు.
దానికి అక్కినేని కూడా ఓకే అన్నారు. అయితే ఆ మరుసటి రోజు మాత్రంఎన్టీయార్ లేరు. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు అక్కినేని పరుగున వెళ్ళాల్సి వచ్చింది. తన ప్రాణ మిత్రుడు ఎన్టీయార్ చివరి పిలుపుని అలా అక్కినేని వినాల్సి వచ్చింది. ఎన్టీయార్ సీఎం గా ఉన్నపుడు కానీ ఆయన మాజీ సీఎం గా ఉన్నపుడు కానీ ఎపుడూ సినిమా గురించి మరచిపోలేదు. సినిమా వారితో తన అనుభవాలు పాత ముచ్చట్లను ఆయన నెమరువేసుకునే ఉండేవారు.
సినీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఎన్టీయార్ కి తీరని కోరికలు ఉన్నాయా అంటే ఆయన ఇంకా మహనీయుల పాత్రలు పోషించాలని ఆశించేవారు అని చెబుతారు. అలాగే వీలు దొరికితే మంచి సబ్జెక్ట్ కి దర్శకత్వం చేయాలని కూడా ఆలోచించేవారు అంటారు. ఎన్టీయార్ నిరంతరం శ్రమించే గుణం ఉన్న వారు. అలాగే ఆయన తన బహుముఖ ప్రతిభతో చిత్ర సీమని మరింత ఎత్తుకు తీసుకుని వెళ్లాలని భావించేవారు.
ఏది ఏమైనా ఒక్క మాట చెప్పుకోవాలి. ఎన్టీయార్ కారణ జన్ముడు, రణ జన్ముడు. ఆయనకు సరిసాటి ఎవరూ లేరు. ఆయన ఒక్కరే. దటీజ్ ఎన్టీయార్అని మాత్రమే చెప్పాలి.