విపక్షాలు తురుపు ముక్కలే.. అసలు పోటీ వీరి మధ్యే
ఒక్క రోజు వ్యవధిలో రెండు ప్రధాన పార్టీలు నిర్వహిస్తున్న`కూటమి` సమావేశాలు.
ఒక్క రోజు వ్యవధిలో రెండు ప్రధాన పార్టీలు నిర్వహిస్తున్న`కూటమి` సమావేశాలు.. జాతీయ రాజకీయాలను వేడెక్కించాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరిది పైచేయి అవుతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి కారణం.. జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేస్తుండడం. అదేసమయంలో కాంగ్రెస్ వ్యూహానికి ప్రతివ్యూహం సిద్ధం చేస్తూ.. ప్రధాని మోడీ కూడా ఎన్డీయే పక్షాలను బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరుపక్షా లు కూడా తమ బలాబలాను సంసిద్ధం చేసుకుంటున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ మోడీని ఓడించాలనేది కాంగ్రెస్ పట్టుదల. కానీ, ఇదేసమయంలో విశ్వగురువు ఓడిపోవడమా? అనే ధీమాతో బీజేపీ వ్యూహాత్మక అడుగులు మరోవైపు. వెరసి.. జాతీయ రాజకీయాలలో కనీ వినీ ఎరుగని విధంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు ఒకరు.. మిత్రపక్షాలను కలుపుకొని పోయేందుకు మరొకరు పరుగులు పెడుతున్నారు. ఈ నెల 17న(సోమవారం) బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న విపక్ష సమావేశానికి ఆసేతు హిమాచలం నుంచి కీలక నాయకులు హాజరవుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు అంతో ఇంతో అలకబూనిన ఆమ్ ఆద్మీ పార్టీ వంటి వాటిని కూడా కాంగ్రెస్ లైన్‌లోకి తెచ్చుకుంది. సో.. మొత్తానికి 19 విపక్షాల కూటమి నుంచి ఇప్పుడు చిన్నా చితకా పార్టీలతో కలిపి 23 పార్టీల కూటమితో కాంగ్రెస్ ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఇక, ఒక్కరోజు వ్యవధిలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో బీజేపీ నాయకులు కీలక మిత్రపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రెండుపక్షాల వ్యూహం ఒక్కటే వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని.. గెలుపు గుర్రం ఎక్కడమే. అయితే.. ఈ పరిణామాల వెనుక మరో వ్యూహం కూడా కనిపిస్తోందని అంటున్నారు జాతీయ పరిశీలకులు.
``ప్రస్తుతం కాంగ్రెస్‌తో అయినా.. బీజేపీతో అయినా.. ఒకటి రెండు పార్టీలు తప్ప.. మిగిలిన పార్టీలు కలవడం కేవలం సంఖ్యాబలం కోసమే. వాటికి ప్రజల్లో అంత ఆదరణ లేదు. అయితే.. మొత్తంగా ప్రధాన పోటీ మాత్రం ఇటు మోడీ, అటు సోనియాగాంధీల చుట్టే ఉంటుంది. దీనిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. క్షేత్రస్థాయిలో తమ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పెద్దపార్టీలు చేసిన, చేస్తున్న ప్రయత్నంలో ఇదొక భాగం. మెయిన్ కాంపిటీషన్ మాత్రం సోనియా, మోడీలే. దీనిలో ఎలాంటి సందేహం లేదు`` అని జాతీయ రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతుండడం గమనార్హం.