నా కూతురు నా ఆస్తి కాదు.. ఏమన్నా సంబంధం లేదు: ముద్రగడ కౌంటర్
ముద్రగడను జగన్‌వాడుకుంటున్నారని.. తన తండ్రి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
వైసీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంట్లో చెలరేగిన రాజకీయ కల్లోలం.. కీలక మలుపులు తిరిగింది. ముద్రగడ జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్‌ను అసెంబ్లీ గేటు వరకు కూడా వెళ్లనివ్వనని చెబుతున్నారు. ఆయనను ఓడిస్తానని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా తన పేరు కూడా మార్చుకుంటానని చెప్పారు. ఇలాంటి హాట్ హాట్ గా పిఠా పురం రాజకీయాలు రగులుతున్న సమయంలో ఆయన కుమార్తె క్రాంతి భారతి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
ముద్రగడను జగన్‌వాడుకుంటున్నారని.. తన తండ్రి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పేరు మార్చుకోవడం అనే కాన్సెప్టు ఏంటో తనకు అర్ధం కావడం లేదన్నారు. అంతేకాదు.. పవన్‌కు తాను మద్దతిస్తున్నట్టు కూడా క్రాంతి ప్రకటించారు. ఆయన తరఫున ప్రచారం చేయనున్నట్టు కూడా చెప్పారు. ఇలాంటి కీలక సమయంలో ముద్ర గడ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. అయితే.. ఆ వెంటనే ఆయన తన కుమార్తె భారతికి భారీ కౌంటర్ ఇచ్చారు.
భారతి తన కుమార్తేనని.. ఒకప్పుడు తన ఆస్తి అని.. కానీ, ఇప్పుడు కాదని అన్నారు. ఇప్పుడు భారతి ఏమన్నా.. తాను పట్టించుకోనన్నారు. అంతేకాదు.. భారతి ఇప్పుడు తన అత్తగారి ఇంటి ఆస్తిగా ముద్రగడ పేర్కొన్నారు. రాజకీయంగా ఆమె వస్తానంటే తాను స్వాగతిస్తానని చెప్పిన ముద్రగడ.. ప్రత్యర్థిగానే చూస్తానని చెప్పారు. అయితే.. భారతి వెనుక.. కుట్ర చేశారని.. తనను దెబ్బతీయడం చేతకాక.. కన్న కూతురినే బరిలోకి దింపారని ముద్ర గడ విమర్శలు గుప్పించారు.
అయితే.. ఈ రాజకీయం వెనుక.. వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై ముద్రగడ సందేహలు వ్యక్తం చేశారు. ఎవరు బెదిరించినా.. తాను భయపడేది లేదన్న ముద్రగడ.. ఇప్పుడు తను బాధితుడిని అయితే.. రేపు దొరబాబు మాత్రం ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. రాజకీయాల్లో అనే ఆటు పోట్లు ఎదుర్కొన్నా నని.. ఇలాంటి పిల్లకాకులను ఎంతో మందిని చూశానని వ్యాఖ్యానించారు. ఎంత మంది వచ్చినా.. పిఠాపురంలో గీత నే గెలిపిస్తామని చెప్పారు.