ప్రముఖ పర్యటక దేశానికి అందమైన మహిళా ప్రధాని.. 37 ఏళ్ల వయసులోనే

థాయ్ లాండ్ లో గత బుధవారం అనూహ్య పరిణామం జరిగింది. ప్రధానిగా స్రేత తావిసిన్ ను రాజ్యాంగ న్యాయస్థానం తప్పించింది.

Update: 2024-08-16 08:03 GMT

తూర్పు ఆసియాలో ప్రముఖ పర్యటక దేశం అనగానే మనందరికీ గుర్తొచ్చేది.. ఇండోనేసియా, థాయ్ లాండ్. ఏటా లక్షలాది పర్యటకులు ఈ దేశాలకు వెళ్తుంటారు. అయితే, రాజకీయంగా కాస్త స్థిరత్వం తక్కువే. ఈ దేశాలను ఒకప్పుడు పాలించిన నాయకుల్లో అవినీతితో విమర్శల పాలయ్యారు. థాయ్ లాండ్ కు తక్సిన్ షినవత్రా 2001-06 మధ్య ప్రధానిగా ఉన్నారు. అయితే, ఆయనపై సైనిక తిరుగుబాటు జరిగింది. విదేశాల్లో 15 సంవత్సరాలు ఉండి.. గత ఆగస్టులో స్వదేశానికి వచ్చారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం తక్సిన్ వయసు 75.

నాన్న బాటలో..

థాయ్ లాండ్ లో గత బుధవారం అనూహ్య పరిణామం జరిగింది. ప్రధానిగా స్రేత తావిసిన్ ను రాజ్యాంగ న్యాయస్థానం తప్పించింది. క్యాబినెట్ కు నేర చరిత్ర ఉన్న న్యాయవాదిని నియమించినందుకు ఈ చర్య తీసుకుంది. ఈయన స్థానంలో ప్రధానిగా శుక్రవారం పేటోంగ్టార్న్ షినవత్రా బాధ్యతలు చేపట్టారు. ఈమె ఎవరో కాదు.. తక్సిన్ కుమార్తెనే. వయసు 37 ఏళ్లు. థాయ్ ప్రధాని కానున్న అతి చిన్న వయస్కురాలు ఈమె. తక్సిన్ కు ఉన్న ముగ్గురు పిల్లల్లో చిన్నది పేటోంగ్టార్న్.

ధనికురాలు.. అందగత్తె..

తక్సిన్ కు బిలియనీర్ ప్రధానిగా పేరుండేది. ఆయన కుమార్తె పేటోంగ్టార్న్ కూడా ధనికురాలే. కాగా, షినవత్రా కుటుంబంలో ప్రధాని అయిన నాలుగో వ్యక్తి కూడా. సోమ్చాయ్ వాంగ్సావత్ 2008లో కొద్ది రోజులు ప్రధానిగా ఉన్నారు. యింగ్లక్ షినవత్రా 2011-14 మధ్యన ప్రధానిగా చేశారు. సోమ్చాయ్, యింగ్లక్ కోర్టు తీర్పులతో వైదొలగారు. కాగా, థాయిలాండ్ లోని ప్రతిష్ఠాత్మక పాఠశాలల్లో, యూకేలోని వర్సిటీలో చదివిన పేటోంగ్టార్న్.. షినవత్రా కుటుంబానికి చెందిన రెండె హోటల్ సంస్థలో పనిచేశారు. 2021లో ఫియు థాయ్ లో చేరారు. ఎన్నికలకు ముందు పార్టీ ముగ్గురు ప్రధాన మంత్రి అభ్యర్థుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. 2023 అక్టోబరులో పార్టీ నాయకురాలిగా నియమితులయ్యారు.

గత సెప్టెంబరులో థాయ్ రాజు మహా వజిరాలాంగ్‌ కార్న్‌ కు తక్సిన్ క్షమాభిక్షఅభ్యర్థన పెట్టుకోగా జైలు శిక్షను ఏడాదికి తగ్గించారు. వయసు, ఆరోగ్య సమస్యలతో జైలు నుంచి విడుదలయ్యే అర్హత పొందారు.

Tags:    

Similar News