నత్వానీ `బూస్ట్`.. వాడుకోకపోతే ఎలా జగనూ..!
వైసీపీ తరఫున ఆయన రాజ్యసభలో మాట్లాడారు. 2022-24 మధ్య వైసీపీ సర్కారు పనితీరుపై ఆయన రాజ్యసభలో కొన్ని ప్రశ్నలు సంధించారు.
పరిమళ్ నత్వానీ.. దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. 2021లో ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్య త్వాన్ని ఇచ్చింది. మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ముఖేష్ అంబానీ ప్రియ మిత్రుడు కావడం.. బీజేపీ దన్ను ఉండడంతో వైసీపీ ఏపీ కోటాలో ఆయనను రాజ్యసభకు పంపించింది. అయితే.. ఇన్నాళ్లలో లేని విధంగా పరిమళ్ నత్వానీ తాజాగా వైసీపీకి బూస్ట్ ఇచ్చారు. వైసీపీ తరఫున ఆయన రాజ్యసభలో మాట్లాడారు. 2022-24 మధ్య వైసీపీ సర్కారు పనితీరుపై ఆయన రాజ్యసభలో కొన్ని ప్రశ్నలు సంధించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా? రాలేదా? అని తొలి ప్రశ్న సంధించారు. దీనికి కేంద్రం తాజాగా సమాధానం చెప్పింది. అది కూడా లిఖిత పూర్వకంగానే కావడంతో ఇది రికార్డయింది. ఏపీకి 2022-24 మధ్య కాలంలో అనేక పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. అయితే..నత్వానీ అక్కడితో కూడా ఊరుకోకుండా.. ఎన్ని వచ్చాయంటూ.. అనుబంధ ప్రశ్న సంధించారు. దీనికి కూడా కేంద్రం సమాధానం ఇస్తూ.. 9486 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని తెలిపింది.
ఈ జాబితాను కూడా లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఆ వెంటనే.. ఆయా సంస్థల ద్వారా ప్రజలకు జరిగే మేలు వివరించాలని నత్వానీ కోరారు. ఇలా.. మొత్తంగా మూడు ప్రశ్నలు సంధించినా.. బలమైన ప్రశ్నలు అడగడం.. దీనికి తడుము కోకుండా.. ప్రభుత్వం స్వయంగా జవాబు చెప్పడం గమనార్హం. ఈ పరిణామాలతో ఇప్పటి వరకు వైసీపీ అసలు పెట్టుబడులు సాధించలేదన్న వాదన వీగిపోయింది.అయితే.. నత్వానీ చేసిన ఈ ప్రయత్నం.. కేవలం నాలుగు గోడల మధ్య, రాజ్యసభకే పరిమితమైంది.
వాస్తవానికి ఇలాంటి అంశాలు తెరమీదికి వచ్చినప్పుడు.. వైసీపీ చక్కగా వినియోగించుకునే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఏమీ రాలేదని.. ఏమీ చేయలేదన్న విమర్శలను కూడా బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ, అలాంటివేవీ కూడా జగన్ పట్టించుకోలేదు. నిజానికి నత్వానీ తాను చేయాల్సిన ప్రయత్నం చేశారు. కానీ, ఆయన నేరుగా ప్రజల మధ్యకు వచ్చి.. చెప్పలేరు. భాషా ప్రాబ్లంతో పాటు.. రాష్ట్రంలో ఆయన పర్యటన చేయడం కూడా.. సాధ్యం కాదు.
కానీ, దీనిని వైసీపీ క్షేత్రస్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ, జగన్ మాత్రం నత్వానీ ప్రయత్నాన్ని నీరు గార్చారు. ఆయన ప్రశ్నలతో కేంద్రం ఇచ్చిన జవాబును ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. ఇది ఇతర నాయకులకు ఇబ్బందిగా మారింది. మేం చేసినా.. ఇలానే ఉంటుందన్న ఆలోచన వారిలో వచ్చేలా చేశారని.. నాయకులు వ్యాఖ్యానించుకునే పరిస్థితి వచ్చింది.