తిరుమల లడ్డూపై పవన్ కీలక వ్యాఖ్యలు... తెరపైకి వక్ఫ్ బోర్డు తరహా బోర్డు!

ఇలాంటి సున్నితమైన విషయాల్లో స్పష్టత రహిత వ్యాఖ్యలు సరికాదనే చర్చా తెరపైకి వచ్చింది.

Update: 2024-11-29 04:18 GMT

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరిగింది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో స్పష్టత రహిత వ్యాఖ్యలు సరికాదనే చర్చా తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది స్పెషల్ ఇన్వెస్టిగెషన్ టీమ్ (సిట్). కొంతకాలంగా ఈ వ్యవహారంలో సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన సిట్.. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహరంలో దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన వేళ... ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇందులో భాగంగా... తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.

అయితే... గత ప్రభుత్వ హయాంలో పవిత్రమైన లడ్డూలు ప్రతి స్థాయిలోనూ కలుషితాన్ని ఎదుర్కోవడం విచారకరం అని చెప్పిన పవన్... ఈ విషయాన్ని మొదటిగా సీఎం చంద్రబాబు వెల్లడించినప్పుడు షాక్ తిన్నట్లు చెప్పారు. తన నామకరణ కార్యక్రమం కూడా తిరుమలలోనే జరిగిందని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేసుకున్నారు.

ఇదే సమయంలో... తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం మాదిరి క్రైస్తవ్యంలోనో, ఇస్లాంలోనో జరిగితే ఆ మతస్తులు తీవ్రంగా స్పందిస్తారని.. కానీ, హిందువులు మాత్రం ఆ స్థాయిలో స్పందించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆలయాల వ్యవహారాలు మాత్రమే కోర్టుకు ఎందుకు వెళ్తున్నాయని పవన్ ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడిన పవన్... వక్ఫ్ బోర్డు తరహాలో హిందువులకు కూడా ఓ కామన్ బోర్డు ఉండాలని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మ బోర్డు అవసరం ఉందని.. అందుకే దాన్ని ప్రకటించాలని పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు.

ఇక కొండపై అన్యమతస్థుల టాపిక్ పై స్పందించిన ఆయన.. హిందువుల ఆలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదని.. మక్కాలోనూ, జెరుసలేం లోనూ అన్యమతస్థులు లేరని అన్న్నారు. ఇక శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇంత గొడవ ఎందుకు చేస్తున్నరంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

ఇక.. తాను హిందువునని చెప్పిన పవన్.. అదే సమయంలో మిగిలిన మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఇదే సమయంలో.. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని, ఇస్కాన్ మాజీ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు, తదనంతర పరిణామలు ఆవేదన కలిగిస్తున్నాయని పవన్ తెలిపారు.

ఈ సందర్భంగా... బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు ఆపేందుకు ఆ దేశ ప్రధాని మహమ్మద్ యూనస్ చర్యలు తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News