ముద్రగడకు భారీ షాక్ ఇచ్చేసిన పవన్

ఆయనది దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘమైన రాజకీయం.

Update: 2024-10-20 02:51 GMT

గోదావరి జిల్లా రాజకీయాల్లో కానీ ఒక బలమైన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న నేపథ్యం నుంచి చూసినా కానీ ముద్రగడ పద్మనాభానికి సరిసాటి ఎవరూ లేరు. ఆయనది దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘమైన రాజకీయం.

ఆయనలో నిజాయతీ ఉంది. అవినీతి లేదు, అదే సమయంలో ఆవేశం చాలా ఉంది. దాని వల్లనే ఆయన చాలా తొందరగా తీసుకునే నిర్ణయాలు ఆయనకు ఇబ్బంది కలిగించాయని చెబుతారు. అలాంటి ముద్రగడ పద్మనాభం ఇపుడు వైసీపీలో చేరారు. ఆయన రాజకీయంగా ఏమంతా యాక్టివ్ గా ఆ పార్టీలో లేరు.

అయితే ముద్రగడ రాజకీయం కానీ ఆయన కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కు అన్నది కూడా ఒకనాటి ముచ్చటగా మారుతోందా అన్నది చర్చగా ఉంది.అదే గోదావరి జిల్లాల నుంచి కొత్త రాజకీయం మొదలైంది. పవన్ కళ్యాణ్ జనసేన అక్కడ బాగా పాతుకుని పోతోంది. ఒక బలమైన సామాజిక వర్గం ఆ పార్టీ చుట్టూ ర్యాలీ అవుతోంది.

అది ఎంతలా అంటే ఏకంగా కాపు పెద్దగా ఉంటూ ఒకనాడు కాపులను ముందుండి నడిపించిన ముద్రగడ సొంత కుమార్తె సైతం జనసేనలో చేరేటంతగా అని చెప్పాల్సి ఉంటుంది లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్ ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరడం. ఆమె ఆ విధంగా చేరడం తండ్రి ముద్రగడకు షాకింగ్ గానే ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు పవన్ కి ఎదురు నిలిచి వైసీపీలో ఉన్న ముద్రగడకు పవన్ కళ్యాణ్ వైపు నుంచి వచ్చిన భారీ షాక్ అని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే సరిగ్గా ఎన్నికలు ముంగిట ఉన్నాయనగా ముద్రగడ కుమార్తె జనసేనకు జై కొట్టారు. ఆనాడు పార్టీలో చేరలేదు కానీ ఆమె పవన్ కి మద్దతుగా నిలిచారు. అయితే ఇన్నాళ్ళకు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి పవన్ ఉప ముఖ్యమంత్రిగా తన హవా చాటుకుంటున్న నేపధ్యంలో ముద్రగడ కుమార్తె జనసేన కండువా కప్పుకోవడం అంటే అది కచ్చితంగా ముద్రగడకు పెద్ద దెబ్బ అని అంటున్నారు.

ఎన్నికల వేళ క్రాంతి తన సపోర్ట్ ని జనసేనకు ఇచ్చిన వేళ పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని చీల్చుతున్నారు అని ముద్రగడ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరిపుడు ఏకంగా జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ మనిషిగా ముద్రగడ కుమార్తె నిలిచింది. దాంతో దీని మీద ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే గోదావరి జిల్లా రాజకీయాలను ఒడిసిపట్టే ప్రయత్నంలో ఉన్న జనసేనకు ముద్రగడ కుటుంబం నుంచి కీలక వ్యక్తి తమ పార్టీలో చేరడం మంచి పరిణామంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ముద్రగడ కుమార్తెకు కీలకమైన పదవిని కట్టబెడతారు. మొత్తానికి ముద్రగడ కుమార్తె జనసేనలో చేరడంతో తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలతో పాటు సామాజిక సమీకరణలలో కూడా భారీ మార్పులు వస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News