తగ్గని జ్వరంలోనూ లెక్క చేయని పవన్.. మీడియాకు పట్టదెందుకు?

మొండితనం కొన్నిసార్లు ఆయుధంగా మారుతుంది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మొండితనం ఎక్కువ.

Update: 2024-09-10 06:30 GMT

మొండితనం కొన్నిసార్లు ఆయుధంగా మారుతుంది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మొండితనం ఎక్కువ. ఆ మాటకు వస్తే తెగింపు విషయంలోనూ ఆయన్ను వేలెత్తి చూపలేం. ఒకసారి డిసైడ్ అయ్యాక తన మాట తానే వినన్నట్లుగా అప్పుడప్పుడు వ్యవహరిస్తుంటారు పవన్ కల్యాణ్. వరద ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సమాచారం తెలుసుకుంటున్న ఆయన.. తన ఆరోగ్య సమస్యల్ని పక్కన పెట్టేశారు.

తగ్గని జర్వంతో ఇబ్బంది పడుతున్నా.. లెక్క చేయకుండా ముంపు ప్రాంతాల్లో నానా అవస్థలుపడుతున్న ప్రజల్ని కలిశారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం కనిపించింది. పేదల ఇళ్ల వద్దకు బోటులో వెళ్లటం.. బురదమయంగా మారిన ప్రాంతాల్లో కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ.. ప్రతి ఒక్కరు చెప్పే కష్టాల్ని.. వేదనల్ని వింటూ.. వారికి భరోసాను ఇస్తూ ముందుకు సాగారు. తాను ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ముంపు ప్రాంతాన్ని సందర్శించారు.

బోటు ఎక్కిన పవన్.. కలెక్టర్ తో కలిసి ముంపునకు గురైన కాలనీలకు వెళ్లి.. ముంపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని తక్కువ చేసి చూడలేం. అందునా ఆ పదవిలో పవన్ కల్యాణ్ ఉన్నప్పుడు ఆ పదవికి ఆటోమేటిక్ గా వచ్చే పవర్ అంతా ఇంతా కాదు. అయినప్పటికీ ఆయనకు.. ఆయన చేసే పనులకు ప్రధాన మీడియాలో లభించే స్థానం.. ఆయన్ను కవర్ చేసే విషయంలో వ్యవహరించే తీరు కాస్త భిన్నంగా ఉండటం కనిపించదు.

ఒక డిప్యూటీ సీఎం స్థాయి నేత జ్వరంతో బాధ పడుతూ.. కాళ్లకు చెప్పుల్లేకుండా బురదతో నడుచుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడిచినప్పుడు.. ఆ అంశం ఎందుకు హైలెట్ కాదు? దాన్ని కనీసం కూడా ప్రస్తావించని ప్రధాన మీడియా సంస్థల్ని ఏమనాలి? ఎలా చూడాలి? ఇదే పని వేరే వారు చేసి ఉంటే.. కాళ్లకు చెప్పుల్లేని ఫోటోలను వేసి.. దానికి ఎర్ర సర్కిల్ వేసి మరీ.. ప్రస్తావించటం.. ప్రజలకు తెలిసేలా చేస్తారు కదా? మరి.. పవన్ విషయంలో అలాంటివేమీ ఎందుకు జరగవు? పవన్ చేసే పనులు.. పడే కష్టం ఎందుకు కనిపించదన్న వాదన ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రధాన మీడియా సంస్థలకు ఏదో ఒక రోజు ఎదురవుతుందన్న అభిప్రాయం పవన్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News