పవన్ ఇమేజ్ కు అసలుసిసలు పరీక్ష

కొన్నికాంబినేషన్లు అస్సలు సూట్ కావు. ఈ విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ మిస్ అయ్యారా? తన మాటకు.. తన చేష్టలకు ఊగిపోయే అభిమానులకు తాజాగా పెద్ద పరీక్షే పెట్టారు.

Update: 2024-09-30 04:28 GMT

కొన్నికాంబినేషన్లు అస్సలు సూట్ కావు. ఈ విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ మిస్ అయ్యారా? తన మాటకు.. తన చేష్టలకు ఊగిపోయే అభిమానులకు తాజాగా పెద్ద పరీక్షే పెట్టారు. మరి.. అందులోఆయన మాట ప్రభావం ఎంతన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న కాలంలో ప్రతి అంశానికి ఒక కొలత ఉంటుంది. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది. ఒక క్రేజ్ ఉన్న హీరో నుంచి విడుదలయ్యే భారీ సినిమా కోసం తెల్లవారుజామున మూడు గంటలకు లేచి.. నాలుగు గంటలకు సినిమా చూసేందుకు.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా థియేటర్ వైపు పరుగులు తీస్తారు.

అదే అభిమానులు ఫలానా పండుగ రోజున తెల్లవారుజామున మూడుగంటలకు లేచి.. చన్నీళ్లతో స్నానం చేసి.. కాళ్లకు చెప్పులు లేకుండా గుడికి వెళ్లి.. ప్రదక్షిణాలు చేయాలని చెబితే.. ఎంత మంది రియాక్టు అవుతారు? అన్న ప్రశ్నకు సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిందే. ఇప్పుడు పవన్ అలాంటి పనే చేశారు. తాను నమ్మిన విషయాల్ని తాను మాత్రమే కాదు..లక్షలాది మంది చేయాలన్న మాట ఎంతవరకు పని చేస్తుందన్నది ప్రశ్న.

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన అపచారంపై ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని పిలుపునివ్వటం ఆసక్తికరంగా మారింది. తాజా ఎపిసోడ్ తో ఆయన మాటకు ఉండే ప్రభావం ఎంతన్న విషయం అందరికి అర్థమవుతుందని చెబుతున్నారు.

మిగిలిన అంశాలకు హిందువలకు.. వారి దేవుడి గురించి.. నమ్మకాల నుంచి.. ధర్మం గురించి చెబితే దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారన్న విషయంపై పవన్ కల్యాణ్ కు అవగాహన లేనట్లుంది. తన తాజా పిలుపుతో తనకు తానే ఒక పెద్ద పరీక్షలోకి వెళ్లిపోయారు. హిందువులంతా దీక్షకు నడుం బిగించాలని పిలుపునిచ్చిన తర్వాత.. ఆ మాటకు పెద్దగా స్పందన లేకపోతే జరిగే నష్టం పవన్ కల్యాణ్ కా? లేదంటే సనాతన ధర్మానికా? అన్నది చూస్తే.. ఎవరికి తోచిన విదంగా వారు అన్వయించుకుంటారని మాత్రం చెప్పొచ్చు.

అలా అని హిందువుల భక్తి ఉండదా? నమ్మకం ఉండదా? అన్న ప్రశ్నలు వేస్తే.. ఉండదని ఎవరూ చెప్పరు. కానీ.. తాము నమ్మే ధర్మానికి సంబంధించి ఫలానా పని చేయాలని చెప్పటాన్ని వారు జీర్ణించుకోరు. దేవుడ్నినమ్మటం అంటే.. రోజు గుడికి వెళ్లి.. స్వామి వారి దర్శనం చేసుకోవటం మాత్రమేనా? అన్న ప్రశ్నను సంధిస్తారు. ఇదే వ్యక్తులు.. పరీక్షలప్పుడు.. తాము ఏదైనా పెద్ద సమస్యలో ఇరుక్కున్నప్పుడు మాత్రం.. నిత్యం గుర్తుకు రాని దేవుడు.. అప్పుడు.. ఆ టైంలో మాత్రం పదే పదే గుర్తుకు వస్తాడు.

అలాంటి మైండ్ సెట్ ఉన్న వారితో.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. తిరుమల శ్రీవారికి క్షమాపణలు చెప్పుకునేందుకు దీక్ష చేపట్టాలని కోరటం.. దానికి స్పందన ఎంతన్న విషయంలో పవన్ ప్రాక్టికాలిటీ మిస్ అయ్యారా? అన్నదిప్పుడు చర్చ. ఇలాంటి పిలుపులు ఇచ్చే వేళలో.. ప్రాక్టికల్ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికి పవన్ పిలుపునకు ఎంతటి స్పందన ఉంటుందన్న ది కూడా ఆసక్తికరమే అవుతుంది.

Tags:    

Similar News