పవన్ కి ప్లాన్ బీ ఉందా ?

రాజకీయాల్లో ప్లాన్ ఏ బీ సీ డీ ఇలా చాలా ఉండాలి. ఎందుకు అంటే రాజకీయమే అంత. ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు

Update: 2024-10-08 05:26 GMT

రాజకీయాల్లో ప్లాన్ ఏ బీ సీ డీ ఇలా చాలా ఉండాలి. ఎందుకు అంటే రాజకీయమే అంత. ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్లాన్ ఏ అనుకుని వెళ్తే అది రివర్స్ కావచ్చు. అపుడు వెంటనే ప్లాన్ బీ కి వెళ్లేలా ప్లాన్స్ ఉండాలి. ఈ విషయాలు అన్నీ తెలిసిన వారు కాబట్టే చంద్రబాబు రాజకీయంగా అర్ధ శతాబ్ద కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు.

రాజకీయం అంటే మరు క్షణం ఏమి జరుగుతుందో తెలియదు. ఇక్కడ మిత్రులు శత్రువులు ఎవరూ శాశ్వతం కాదు, రాజకీయంగా మనుగడ సాగించాలంటే ప్లాన్స్ సిద్ధం చేసుకోవాలి. అదే విధంగా ఎన్ని చేసినా తన మూల సిద్ధాంతం మారలేదు అని జనాలను పార్టీ జనాలను నమ్మించగలగాలి.

చంద్రబాబు అయితే 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దానికి ఆయన చెప్పిన రీజన్. బీజేపీని ఎదుర్కోవాలంటే అంతా కలవాలి అని. గతంలో కాంగ్రెసేత పక్షాలు ఉండేవి. ఇపుడు బీజేపీయేతర పక్షాల రాజకీయం అవసరం అని జనాలకు చెప్పగలిగారు. దాంతో ఏ కాంగ్రెస్ కి అయితే బద్ధ వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో ఆ కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపినా పెద్దగా ఇబ్బంది అయితే రాలేదు.

ఇక అయిదేళ్ళు తిరగకుండానే బాబు మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. 2024లో అధికారంలోకి వచ్చారు ఎవరేమి అనుకున్నా ఆయన పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోంది. ఏపీ బాగుపడాలి అంటే కేంద్ర సాయం ముఖ్యమని ఏపీ జనాలకు ఫుల్ క్లారిటీతో చెప్పగలిగారు.

ఇక ఈ బంధం ఎన్నాళ్ళు అంటే ఏమో చెప్పలేరు. ఏపీ ప్రయోజనాలే తనకు పరమావధి అని బాబు ఒకటికి పది సార్లు చెబుతూ వస్తున్నారు. దాంతో కేంద్రంలో రాజకీయం మారి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా ఏపీ కోసం అని మద్దతు ఇచ్చినా ఇవ్వవచ్చు అని అంటున్నారు. అలా బాబు వద్ద ప్లాన్ బీ కూడా రెడీగా ఉంటుందని సెటైర్లు ఉన్నాయి.

సరే రాజకీయంగా అపర చాణక్యుడు చంద్రబాబు కాబట్టి ఆయన ఆలోచనలను ఊహించడం కూడా కష్టమే. ఇక జనసేన అధినేత విషయానికి వస్తే ఆయన కూటమిని కట్టించి ఏపీలో వైసీపీని ఓడించడంలో సక్సెస్ అయ్యారు. అలా పవన్ ఎంతో వ్యూహంగా ఆలోచించారు అని అంతా అనుకున్నారు.

కానీ రాజకీయం ఎపుడూ అలాగే ఉండదు కదా బీజేపీ మూడవసారి మెజారిటీ రాకున్నా మిత్రుల అండతో అధికారంలోకి వచ్చింది. మరి 2029 ఏమిటి అన్నది కూడా ఉండాలి కదా. అలా అని బీజేపీని దూరం చేసుకోమని కాదు. బీజేపీకి వత్తాసుగా ఉండేలా వీర హిందూత్వను పుచ్చుకుని జనంలో పెద్ద గొంతుకతో వస్తే రేపటి రోజున బొమ్మ తిరగబడితే అపుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా చూడాలి కదా అంటున్నారు.

అఫ్ కోర్స్ పవన్ తిరుపతి సభలో తనకు సనాతన ధర్మం కంటే ఏదీ ముఖ్యం కాదు ఆఖరుకు తన రాజకీయం కూడా అని చెప్పేశారు అనుకోండి. కానీ ఆయన నిర్మించిన జనసేనలో అలాంటి పరిస్థితి ఉందా. పార్టీలో చేరిన వారు చేరబోయే వారు కూడా అలాగే అనుకోరు కదా. వారంతా జనసేన మరింతగా విస్తరించాలని అధికారంలోకి వచ్చి పవన్ సీఎం కావాలని కూడా భావిస్తారు కదా.

ఇక పవన్ ఇంతలా కుండబద్ధలు కొట్టేశాక ఎడమ వైపునకు వస్తే ఇబ్బందే అంటున్నారు. ఆయన రైటిస్ట్ పాలిటిక్స్ ని చాలా క్లియర్ ఎంచుకున్నారు అని అంటున్నారు. అయితే టీడీపీ న్యూట్రల్ పాలిటిక్స్ చేస్తోంది. రేపటి రోజున బీజేపీకి ఆదరణ తగ్గితే లౌకిక రాగం కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు.

పవన్ ఈ రోజు సనాతన ధర్మం అంటూ గర్జించి రేపు లౌకిక వాదం అన్నా లేక వేరే విధంగా మాట్లాడినా లోకం మెచ్చుతుందా అన్నదే కదా ప్రశ్న. ఇక పవన్ మీద కమలం ఆశలు బోలెడు పెట్టుకుంది. ఏపీతో పాటు దక్షిణాదికి ఆయననే ముందు పెట్టి తాంజ్ రాజకీయ గోదారి ఈదాలని అనుకుంటోంది. పవన్ ప్రస్తుతం రైటిస్ట్ పాలిటిక్స్ నే చేస్తున్నారు అని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయనకు బీజేపీ నమ్మకమైన మిత్రుడు అంటున్నారు.

2029 నాటికి ఏమైనా తేడా వస్తే ఏపీలో టీడీపీ ఇండియా కూటమిలో చేరితే అంత సులువుగా పవన్ వెళ్ళలేరు. పైగా మోడీని మించిన వారు ఎవరూ లేరని వీర భక్తిని ప్రదర్శిస్తున్న పవన్ బీజేపీతో కలసి 2029లో పోటీ చేయాల్సి ఉంది. సో పవన్ కి ఉన్నది ఒకే ప్లాన్ అదే ప్లాన్ ఏ అని అంటున్నారు. చూడాలి మరి ఈ మధ్యలో ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News