పవన్ ఇమేజ్ కు తిరుమల కొండే సాక్ష్యం
దీనికి ముందు తన చిన్న కుమార్తె తరఫున తానే డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసిన ఆయన తన వెంట వారిని స్వామి వారి దర్శనానికి తీసుకెళ్లారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం వెలుగు చూసిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన దీక్షను విరమించేందుకు తిరుమలకు రావటం తెలిసిందే. అలిపిరి నుంచి కాలి నడకన కొండ ఎక్కిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత దర్శనం సమయానికి అనూహ్య రీతిలో అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తన ఇద్దరు కుమార్తెలను తనతో పాటు దర్శనానికి తీసుకెళ్లారు.
దీనికి ముందు తన చిన్న కుమార్తె తరఫున తానే డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసిన ఆయన తన వెంట వారిని స్వామి వారి దర్శనానికి తీసుకెళ్లారు. దర్శనానికి ముందు తర్వాత ఆలయంలోని పలుచోట్ల తన కుమార్తెలను పలు అంశాల్ని చూపించటమే కాదు.. ఎక్కడైనా.. ఏదైనా మిస్ అవుతారన్న వేళలో తానే అన్నీ చూపించే ప్రయత్నం చేశారు. కూతుళ్లతో కలిసి పవన్ వస్తున్న వైనాన్ని చూసేందుకు వందలాది మంది అలా వెయిట్ చేస్తూ ఉండిపోయారు పవిత్ర పుణ్యక్షేత్రంలో.
దర్శనం తర్వాత స్వామివారి ప్రసాదంగా చెప్పే శ్రీవెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం తిన్నారు. తిన్నామంటే తిన్నామన్నట్లు కాకుండా.. భోజనాన్ని భోజనం మాదిరి తిన్న వైనం చూసినప్పుడు అనిపించే మాట ఒక్కటే. కొండ మీద స్వామి వారిని చూసేందుకు.. ఆయన్ను ప్రసన్నం చేసుకోవటానికి పెద్ద పెద్దోళ్లు చాలామందే వస్తారు. కానీ.. పవన్ కాస్త భిన్నం. స్వామి వారి దర్శనానికి వచ్చినప్పటికి.. కొండకు సంబంధించిన అన్నీ అంశాల్ని పరిశీలించటం.. అన్నింట్లోనూ భక్తితోనూ.. శ్రద్ధతోనూ పరిశీలిస్తూ ముందుకు సాగిన వైనం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు.
కొండకు వచ్చామా? దర్శనం చేసుకున్నామా? ఆ వెంటనే పరుగులు పెడుతు వెళ్లిపోయామా? అన్నట్లు కాకుండా ఒక సగటు భక్తుడి మాదిరి వ్యవహరించిన పవన్ తీరుకు తిరుమల కొండ సాక్ష్యం. ఇందుకు తగ్గట్లు.. తిరుమల కొండ మీద ఆయన వెళ్లిన ప్రతి చోటా ఆయన్ను చూసేందుకు వందలాది మంది వెయిట్ చేయటం కనిపిస్తుంది. ఏమైనా పవన్ ఇమేజ్ ను ప్రత్యక్షంగా చూసింది తిరుమల కొండ. ఇంత చేసినా.. అంత పవర్ పెట్టుకొని ఎలా చెలరేగిపోయాడన్న చెడ్డపేరును మూటగట్టుకోకుండా.. ఎంత ఒద్దికగా వ్యవహరించాడన్న భావన కలిగేలా చేయటమే పవన్ ప్రత్యేకతగా చెప్పక తప్పదు.