ఏపీ అసెంబ్లీలో పవన్, లోకేష్ లతోపాటు వీరంతా ఫ్రెషర్సే!
ఈ క్రమంలో సుమారు 81 మందితో ఈ లిస్ట్ పెద్దగానే ఉంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటం.. కూటమి ఘనవిజయం సాధించడం తెలిసిందే. అయితే ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న ఎమ్మెల్యేల్లో సుమారు సగంమంది కొత్తవారే, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెడుతున్నవారే కావడం గమనార్హం. ఇందులో భాగంగా... 135 సీట్లు గెలుచుకున్న టీడీపీ నుంచి కొత్తవారు ఎక్కువగానే ఉండగా.. జనసేన నుంచి ఎన్నికైన 21 మందిలో 15 మంది ఫ్రెషర్సే!
ఇదే క్రమంలో బీజేపీ నుంచి ఎన్నికైన నలుగురు కూడా అసెంబ్లీకి రావడం ఫస్ట్ టైం! అయితే... ఇప్పుడు చెప్పుకోబోతున్న ఫ్రెషర్స్ లో కొంతమంది ఇప్పటికే కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎంపీలుగా ఉన్నావారు, ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా పనిచేసినవారు ఉన్నప్పటికీ... ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి రావడం మాత్రం వారికి ఇదే తొలిసారి. ఈ క్రమంలో సుమారు 81 మందితో ఈ లిస్ట్ పెద్దగానే ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీ అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గతంలో రెండు చోట్లా ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలైన పవన్ కల్యాణ్ ఈ సారి మాత్రం రికార్డ్ స్థాయి మెజారిటీతో గెలుపొందారు. కూటమి తరుపున జనసేన నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్... 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అనంతరం... 2014 - 19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉంటూ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్.. ఈసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేయబోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘురామకృష్ణంరాజు ఈసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు!
ఇదే క్రమంలో... విజయవాడ పశ్చిమ నుంచి ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా... మరో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వీరితో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు, మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష కూడా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
అదేవిధంగా... మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషన్ కుమార్ రెడ్డి కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరితో పాటుగా లోకం మాధవి (నీలిమర్ల), విజయ్ కుమార్ (యలమంచిలి), పట్నం నానానీ (కాకినాడ రూరల్), దేవ వరప్రసాద్ (రాజోలు), గిడ్డి సత్యనారాయణ (గన్నవరం), కందుల దుర్గేష్ (నిడదవోలు), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం) నేతలు జనసేన నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.