పవన్ కూటమిని జోరెత్తిస్తారా...!?
ఉత్తరాంధ్రాలో కూటమి కొంత వెనకబడింది అన్న టాక్ ఉంది. ఎందుకంటే మూడు పార్టీల మధ్య పొత్తులు ఉన్నాయి.
ఉత్తరాంధ్రాలో కూటమి కొంత వెనకబడింది అన్న టాక్ ఉంది. ఎందుకంటే మూడు పార్టీల మధ్య పొత్తులు ఉన్నాయి. సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు తలెత్తాయి. ఆశావహులు నొచ్చుకున్నారు. చాలా చోట్ల కీలక నేతలు అలిగారు. అన్ని పార్టీలలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల టీడీపీ అధినాయకత్వం పిలిచి నచ్చచెప్పినా అక్కడ ఓకే అని వచ్చిన వారు కూడా సైలెంట్ గా ఉన్నారు.
ఇక విశాఖలో చూసుకుంటే అభ్యర్ధులు ఎవరికి వారుగానే ప్రచారం చేసుకుంటున్నారు. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అయితే తానే అంతా అయినట్లుగా తిరుగుతున్నారు. స్థానిక నేతల సహకారాన్ని ఆయన అర్ధిస్తున్నారు కానీ ఆశించిన స్థాయిలో అయితే స్పందన లేదు.
ఈ నేపధ్యంలో టీడీపీ అధినాయకత్వం ఈ వైపు చూడడంలేదు. చంద్రబాబు గోదావరి జిల్లాల వరకూ ప్రజాగళం సభలు నిర్వహిస్తున్నారు కానీ ఉత్తరాంధ్రా వైపు చూడడంలేదు. ముందు అందరినీ సర్దుబాటు చేసిన మీదటనే ఈ వైపు రావాలన్నది టీడీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు.
ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రా టూర్ కి వస్తున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్రాలో పర్యటిస్తారు. సభలు సమావేశాలు ఉంటాయి. కూటమి నేతలతో ఆయన మాట్లాడుతారు అని అంటున్నారు. అలాగే పార్టీల పరిస్థితిని సమీక్షిస్తారు అని అంటున్నారు.
దీంతో పవన్ రాక మీద కూటమి నేతలు అంతా ఆశలు పెట్టుకున్నారు. పవన్ అనకాపల్లి సభతో శ్రీకారం చుడతారు అని అంటున్నారు. సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన బీజేపీ తరఫున బరిలో ఉంటే అనకాపల్లి ఎమ్మెల్యే సీటుకు జనసేన తరఫున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఇక టీడీపీ జనసేన నేతలు అభ్యర్ధులుగా మిగిలిన అసెంబ్లీ సీట్లలో ఉన్నారు.
పవన్ రోడ్ షోలతో పాటు సభలు నిర్వహించడం ద్వారా కూటమిని జోరెత్తిస్తారు అని అంటున్నారు. పవన్ కోసం ఏర్పాట్లు అయితే కూటమి తరఫున చేస్తున్నారు. విశాఖ విజయనగరం జిల్లాలలో పవన్ పర్యటనలు ఉంటాయని అంటున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటు జనసేనకు ఇచ్చారు. అక్కడ నుంచి లోకం మాధవి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు.
ఆ నియోజకవర్గంలోనూ లుకలుకలు ఉన్నాయి. టీడీపీ జనసేనల మధ్య సమన్వయం లేకుండా ఉంది. దాంతో పవన్ కూటమిలో ఐక్యతకు కృషి చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టికెట్ల ప్రకటన తరువాత ఇటు తమ్ముళ్ళలో స్తబ్దత అవరించింది. జనసేనలోనూ జోష్ తగ్గింది.
భీమిలీ టికెట్ ఆశించిన పంచకర్ల సందీప్ వంటి వారు అయితే మౌన ముద్ర దాల్చారు. ఇపుడు వారందరినీ పవన్ మాట్లాడి కార్యోన్ముఖుల్ని చేస్తారు అని అంటున్నారు. భీమిలీ టికెట్ ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇచ్చారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ టూర్ మీద కూటమి అభ్యర్ధులు ఆశలు పెంచుకున్నారు. చూడాలి మరి ఆయన సభలు సమావేశలు ఎలా సాగుతాయో. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తారో కూడా చూడాల్సి ఉంది.