ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ ను అంతలా టార్గెట్ చేస్తారెందుకు?

ఓపక్క పవన్ ను తిడుతూ.. మరోవైపు తాము కోరుకున్నట్లుగా పవన్ తన ఎజెండాను ఫిక్సు చేసుకోవాలనుకోవటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న

Update: 2023-09-15 04:16 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి టార్గెట్ అయ్యారు. సమకాలీన రాజకీయాల్లో అంశాల పట్ల క్లారిటీ ఉన్న అతి కొద్దిమంది రాజకీయ అధినేతల్లో పవన్ ఒకరు. నిజం చెప్పాలంటే ఇప్పటికే అధికారాన్ని చేపట్టిన వారు.. అధికారంలో ఉన్నవారు సైతం సైద్ధాంతిక అంశాల మీద మాట్లాడే తీరు అస్సలు కనిపించదు. ఎవరికి వారు వ్యక్తిగత నిందలు.. చురకలు.. వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం తప్పించి.. ఒక అంశంపై నిమిషం పాటు మాట్లాడే సత్తా అస్సలు కనిపించదు.

అందుకు భిన్నంగా పవన్ కనిపిస్తారు. ఆయన మాట్లాడే వేళలో ప్రస్తావించే వ్యక్తులను చూస్తే.. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వారిలో ఎంతమందికి వారి పేర్లు తెలుసు? వారి సంగతులు తెలుసు? వారి విధానాలు తెలుసు? సమాజం పట్ల వారి వైఖరి ఎలా ఉండేది? లాంటి అంశాల మీద అవగాహన ఉందా? అన్నది ప్రాథమికమైన ప్రశ్న. పవన్ అన్నంతనే నిలకడ లేని వ్యక్తి.. మాట మీద నిలబడని వ్యక్తి అంటూ రొడ్డు కొట్టుడు మాటలు మాట్లాడే వారు మర్చిపోయే విషయం ఏమంటే.. ఈ రంగంలో ఉన్న వారెవరు తాము మాట్లాడిన మాట మీదనే నిలబడటం అస్సలు సాధ్యం కాదు.

ఈ విషయంలో ఏ రాజకీయ అధినేత కూడా మినహాయింపు కాదు. అలాంటప్పుడు ఎవరి విషయంలోనూ లేని కొలమానాలు పవన్ కు మాత్రమే ఎందుకు పెడతారు? అన్నదే ప్రశ్న. పవన్ కాలు కదిపినా.. నోరు మెదిపినా.. ఒకటే విశ్లేషణలు. అన్నింటికి మించి పవన్ నోటి నుంచి ఏం వచ్చిందన్న దాన్ని వదిలేసి.. పవన్ కు అపాదించేందుకు తాము అనుకున్న విషయాల్ని తీర్పుల రూపంలో ఇచ్చేసే ధోరణి కనిపిస్తుంటుంది.

ఎవరి రాజకీయం వారిది. దీన్ని తప్పు పట్టలేం. కాకుంటే.. మిగిలిన రాజకీయ పార్టీలకు లేని ఒక శాపం పవన్ కల్యాణ్ స్టార్ట్ చేసిన జనసేనకు ఉందని చెప్పాలి. మిగిలిన రాజకీయ పార్టీలు.. వాటి అధినేతలు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా.. ఎలాంటి ప్రకటన చేసినా తప్పు పట్టే విషయంలో పరిమితులు పాటిస్తుంటారు. కానీ.. పవన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా తమదైన తీర్పులు ఇచ్చేస్తుంటారు.

అన్నింటికి మించి.. ఇలానే ఎందుకు ఉండరన్న కండీషన్లను తెర మీదకు తీసుకొస్తారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా తనకంటూ సొంత ప్లానింగ్ ఉండకూడదా? ఆయన్ను విమర్శించే వారు సైతం.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారా.. లేక పవన్ చెప్పినట్లుగా చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇలా ఎందుకు చేయాలి? ఇలా ఎందుకు చేయకూడదు? ఆయన ఎక్కడ పోటీ చేయాలి? ఎన్నిచోట్ల పోటీ చేయాలి? ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఆయన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? లాంటి విషయాల్లో తాము చెప్పినట్లే చేయాలన్న ధోరణి ఆయన రాజకీయప్రత్యర్థుల మాటల్లో వినిపిస్తూ ఉంటుంది.

ఓపక్క పవన్ ను తిడుతూ.. మరోవైపు తాము కోరుకున్నట్లుగా పవన్ తన ఎజెండాను ఫిక్సు చేసుకోవాలనుకోవటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. ఆయన్ను వ్యతిరేకించేవారు.. తప్పు పట్టే వారు.. తరచూ ఒక మాటను అంటుంటారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ అంటూ ఆయనకున్న అతి పెద్ద లోపాన్ని ఎత్తి చూపుతుంటారు. మరి.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ ఏం చేయాలి? రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అన్న విషయాల్ని ఎందుకు డిక్టేట్ చేస్తున్నట్లు? అన్నది అసలు ప్రశ్న. రాజకీయాల్లో పవన్ ఏ మాత్రం ప్రభావితం చేయలేని అధినేత అయినప్పుడు.. ఆయన గురించి అదే పనిగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఎందుకు విమర్శలు చేస్తున్నట్లు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. పవన్ 'పవర్' ఏమిటో అర్థమవుతుంది. కాయలు ఉన్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు.

Tags:    

Similar News