అక్కడా పవన్ ప్రకృతి సాగు.. గోశాల!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన శాఖలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన శాఖలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 3.5 ఎకరాల స్థలాన్ని పవన్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని తెలుస్తోంది.
తాను పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని.. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురంలో కొద్ది రోజుల క్రితం మూడు రోజులపాటు పవన్ పర్యటించారు. నియోజకవర్గ సమస్యలపైన అధికారులతో సమీక్షించారు. నిర్దేశిత సమయంలోగా ఆ సమస్యలను పరిష్కరిస్తాన ని డెడ్ లైనును కూడా ఆయన ప్రకటించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ 3.5 ఎకరాల స్థలం కొనుగోలు చేయడంతో పిఠాపురంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ కూడా జోరుగా సాగుతోంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రియల్టర్లే కాకుండా హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాలకు చెందినవారు ఇక్కడకు వచ్చి భూములు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పవన్ పిఠాపురంలో పోటీ చేయడానికి ముందు ఎకరం 25 లక్షలున్న భూమి ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్లకు చేరుకుందని టాక్ నడుస్తోంది.
అలాగే పవన్ కళ్యాణ్ కు వ్యవసాయం, గోవుల పెంపకం అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. దీంతో ప్రకృతి వ్యవసాయం, గోవుల పెంపకానికి వీలుగా పవన్ మరో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్నారని తెలుస్తోంది.
పిఠాపురంలోని స్థానిక జనసేన నేతలు ఇదే పనిలో ఉన్నారని సమాచారం.
ఇప్పటికే పవన్ కొనుగోలు చేసిన 3.5 ఎకరాల్లో ఆయన నివాసం, డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం, పార్టీ ఆఫీసు ఉంటాయని తెలుస్తోంది. ఇక కొత్తగా కొనుగోలు చేయనున్న పది ఎకరాల్లో ఆయన ప్రకృతి వ్యవసాయం, గోవుల పెంపకం చేపడతారని అంటున్నారు.
ఇప్పటికే పవన్ కు హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్ ఉంది. అందులో ఆయన వివిధ పంటలను సాగు చేస్తున్నారు. మామిడి తోట కూడా ఉంది. ఏటా తన తోటలో పండిన మామిడి పండ్లను ఆయన తన సన్నిహితులకు పంపుతూ ఉంటారు. గతంలో షూటింగులు లేని సమయంలో పవన్ తన ఫామ్ హౌస్ లోనే గడిపేవారు.
అలాగే పవన్ కు ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయం సమీపంలో గోశాల కూడా ఉంది. ఇప్పుడు పిఠాపురంలో కొనుగోలు చేయాలనుకుంటున్న పది ఎకరాల్లో వ్యవసాయంతోపాటు గోశాల కూడా ఉంటుందని సమాచారం.
ఇప్పటికే జనసేన నాయకులు రెండు చోట్ల భూమిని గుర్తించారని చెబుతున్నారు. వాటిని పవన్ చూశాక ఒకదాన్ని కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని సమాచారం.