జనసేనలో ఒక్కసారిగా సైలెంట్.. పవన్ వ్యూహమేంటి...!?

మూడు నెలల పై దాటింది జనసేన వారాహి సభలు నిర్వహించి అని అంటున్నారు

Update: 2024-01-11 02:30 GMT

మూడు నెలల పై దాటింది జనసేన వారాహి సభలు నిర్వహించి అని అంటున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరస మీటింగ్స్ పెట్టారు. ఆ తరువాత మాత్రం వారాహి యాత్రలు ఆగిపోయాయి. ఇక చంద్రబాబు అదే నెల చివరిలో జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన గత కొన్నాళ్ళుగా జోరు పెంచారు. బహిరంగ సభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాని కోసం ప్రత్యేక విమానాలతో ఏపీ అంతా కలియ తిరుగుతున్నారు.

ఈ విధంగా టీడీపీ తన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. టీడీపీ అభ్యర్ధులను డిసైడ్ చేయలేదు. కానీ ముందు పార్టీని సన్నధం చేసుకుంటోంది. అభ్యర్ధి ఎవరు అయినా టీడీపీకి జనాలు ఓటు వేసేలా వారిని తమ వైపునకు తిప్పుకుంటోంది. ఏడున్నర పదుల వయసులో బాబు అలుపు సొలుపు లేకుండా జనంలో ఉంటున్నారు.

ఇక జనసేన విషయం తీసుకుంటే పవన్ కాకినాడలో పార్టీలో అంతర్గత సమావేశాలు కొన్ని రోజులు నిర్వహించారు. మరి వారాహి రధం ఎపుడు బయటకు వస్తుంది. పవన్ ఎపుడు జనంలోకి వెళ్తారు అన్న దాని మీద అయితే ఇంకా ఏమీ సమాచారం లేదు అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కూడా జనసేనను పటిష్టం చేసుకోవాల్సి ఉంది కదా అన్న చర్చ వస్తోంది. అయితే టీడీపీ పొత్తు సీట్లను డిసైడ్ చేసిన తరువాత జనసేన జనంలోకి వెళ్లాలని చూస్తోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అప్పటికి పుణ్య కాలం చాలా గడచిపోతుంది అని అంటున్నారు.

ఈలోగానే పార్టీని జనంలో ఉంచాల్సి ఉందని అంటున్నారు. అయితే జనసేనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. వారాహి యాత్రలు పలు దఫాలుగా నిర్వహించినపుడు అభ్యర్ధులు తాము అవుతామని చాలా మంది నాయకులు డబ్బు ఖర్చు చేసి సభా కార్యక్రమాలు చూశారు. ఇపుడు జనంలోకి వెళ్లాలనుకుంటే చాలా వ్యయప్రయాసలు అవుతుంది. టికెట్ విషయంలో తేల్చకపోతే నాయకులు ఆంతగా ముందుకు కదలరు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వారాహి యాత్ర అయిదు విడతలుగా నిర్వహించిన నేపధ్యంలో జనసేన అధినాయకత్వం చాలా మందికి టికెట్ల హామీ ఇచ్చింది అని అంటున్నారు ఇపుడు వారికి టికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అంటే పొత్తులో భాగంగా టీడీపీ నుంచి అలా ఎంపిక చేసిన సీట్లు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.

దాంతో పొత్తు టికెట్లు ఖరారు అయితే తప్ప వారాహి రధం బయటకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఇంకో మాట ఏంటి అంటే జనసేన కోరుకున్న సీట్లు రాకపోతే అన్నది కూడా వినిపిస్తోంది. కొత్త సీట్లు జనసేనకు ఇస్తే అక్కడ అభ్యర్ధులు చూసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఇక కొన్ని చోట్ల జనసేనలోకి వైసీపీ నుంచి నేతలు వచ్చి చేరుతున్నారు అలా విశాఖ నుంచి ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ చేరారు. ఆయనకు సీటు హామీ ఇచ్చారని అంటున్నారు.

అదే విధంగా క్రికెటర్ అంబటి రాయుడు రేపో మాపో జనసేన కండువా కప్పుకుంటారు. ఆయనకు కూడా ఎంపీ సీటు కోసం చూడాల్సి ఉంది అంటున్నారు. గుంటూరు ఎంపీ సీటునే అంబటి కోరుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా జనసేన శిబిరంలో ఒక్కసారిగా సైలెంట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో టికెట్ల ఖరారు తరువాతనే పవన్ వారాహి రధం బయటకు రావచ్చు అంటున్నారు.

Tags:    

Similar News