పవన్ వారాహి రధం ఎక్కడ...!?

చంద్రబాబుతో కలసి ఉమ్మడి సభలలో పవన్ పాల్గొంటున్నారు. ఆ తరువాత మాత్రం వారాహి సద్దు లేకుండా ఉంటోంది అని అంటున్నారు.

Update: 2024-04-18 01:30 GMT

అప్పట్లో అన్న గారి చైతన్య రధం మాదిరిగా ఎన్నికల వేళ పవన్ వారాహి రధం జనం మధ్యన ఉంటూ జనంతో నెలల తరబడి తిరుగుతూ ఏపీని చుట్టబెడుతుందని అంతా ఆశించారు. కానీ గత ఏడాది జూన్ నెల నుంచి కొద్ది కాలం పాటు ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రమే పవన్ వారాహి రధం తిరిగింది. ఆ తరువాత మాత్రం ఆగిపోయింది. ఎన్నికలు దగ్గర పడిన తరువాత పవన్ ఉధృతంగా ఏపీ అంతా తిరుగుతారు అనుకుంటే పోలింగ్ కి కౌంట్ డౌన్ దగ్గరపడుతోంది కానీ ఆ ముచ్చట అయితే కనిపించడంలేదు.

చంద్రబాబుతో కలసి ఉమ్మడి సభలలో పవన్ పాల్గొంటున్నారు. ఆ తరువాత మాత్రం వారాహి సద్దు లేకుండా ఉంటోంది అని అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభల కంటే ఏపీ అంతటా తానుగా తిరిగి కూటమికి పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేయవచ్చు. కానీ పుణ్య కాలం అంతా ఇలా గడచిపోతోంది. ఉత్తరాంధ్రాలో పవన్ తిరుగుతారు అనుకుంటే ఒక్క అనకాపల్లి సభ మాత్రమే ఇప్పటిదాకా జరిగింది.

అలాగే గోదావరి జిల్లాలలో కూడా సోలోగా పవన్ టూర్లు అయితే పెద్దగా లేవు అని అంటున్నారు. ఇక నామినేషన్ల ఘట్టం వచ్చేసింది. దాంతో కొన్ని రోజులు పిఠాపురంలో పవన్ కి ఆ హడావుడి ఉంటుంది. ఇదంతా అయ్యేసరికి బీజేపీ జాతీయ నేతలు ఏపీకి వస్తారు. వారితో కలసి ఉమ్మడి ప్రచారం చేస్తే అప్పటికి పోలింగ్ డేట్ వచ్చేస్తుంది.

మొత్తం మీద చూస్తే టీడీపీ కూటమిలో క్రౌడ్ పుల్లర్ గా భావించే పవన్ కళ్యాణ్ ప్రచారం కూటమికి బాగా కలసి వస్తుందనుకుంటే ఆయన సింగిల్ గా ప్రచారం అయితే చేయడం లేదు అని అంటున్నారు. ఇక ప్రచారం టీడీపీ జనసేన కలసి చేస్తున్నా రాయలసీమ మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు కర్నూల్, అనంతపురం కడపలలో గట్టిగా పర్యటించాల్సిన కూటమి నేతలు ఆ వైపు చూడడంలేదు. ఆ బాధ్యతలు ప్రస్తుతానికి బాలక్రిష్ణ చూస్తున్నారు కానీ అక్కడ కూటమి సభలు ఉమ్మడిగానూ విడివిడిగానూ పవన్ బాబు నిర్వహిస్తే బాగుంటుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈసారి ఎన్నికల్లో పవన్ ప్రచారం తీవ్ర స్థాయిలో చేయాల్సి ఉందని అంటున్నారు. ఆయన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కాకపోయినా రీజియన్ల వారీగా తిరిగి సభలు పెట్టి జనాలను కూటమి వైపుగా తిప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే కూటమి ఇబ్బందులో పడుతుందని అంటున్నారు.

అయితే పవన్ ఎక్కువగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో ఎన్నికల ప్రచారానికి గట్టిగా 23 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో ప్రచారం చేసుకున్న వారికి చేసుకున్నంత అని అంటున్నారు. చూడాలి మరి నామినేషన్ల తరువాత అయిన జోరు చూపిస్తారో లేదో.

Tags:    

Similar News