జనసేన ఎంతో తగ్గింది..పవన్ సంచలన వ్యాఖ్యలు !

తాను రాజకీయాలు చూడలేదని రాష్ట్ర అభివృద్ధి చూశాను అని ఆయన చెప్పుకొచ్చారు.

Update: 2024-04-10 18:57 GMT

జనసేన ఎంతో తగ్గి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం బాగుండాలంటే పార్టీలు కలసి ఉండాలని భావించి తాము తగ్గామని ఆయన చెప్పారు. తాను రాష్ట్రం మేలు కోరుకునే పొత్తులకు సిద్ధపడ్డాను అని ఆయన అంటున్నారు. తాను రాజకీయాలు చూడలేదని రాష్ట్ర అభివృద్ధి చూశాను అని ఆయన చెప్పుకొచ్చారు.

దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో నంబర్ వన్ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారు అని ఆయన అన్నారు. అదే తీరున ఏపీకి అనుభవం ఎంతో కలిగిన చంద్రబాబు నాయకత్వం అవసరం అని భావించే తాను వెనక్కి తగ్గాను అని చెప్పారు. 1990 దశకంలో చివరలో విజన్ 2020 పేరిట ఒక సైబరాబాద్ పేరిట ఐటీ సిటీని రూపుదిద్దిన వ్యక్తి చంద్రబాబు అని పవన్ పొగిడారు.

దాని వల్లనే ఈ రోజు తెలంగాణకు అదే అభివృద్ధి కేంద్రంగా నిలిచిందని గుర్తు చేశారు. చంద్రబాబు లాంటి వారు ఏపీకి అవసరం అని తాను బాగా తగ్గి పొత్తులకు సిద్ధపడ్డాను అని ఆయన వివరించారు. తాను తగ్గడం వల్ల తన సొంత అన్నయ్య నాగబాబుకు అనకాపల్లి ఎంపీ సీటు పోయిందని ఆయన చెప్పారు. అలాగే తణుకులో ముందు జనసేన పార్టీకి అభ్యర్ధిని ప్రకటించిన తరువాత కూడా తాము తగ్గామని ఆయన గుర్తు చేశారు.

తాను కూటమి కోసం ఎంతో కష్టపడ్డాను అని ఆయన వివరించారు. చంద్రబాబుతో అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో సుదీర్ఘంగా చర్చించి పొత్తులు కుదిర్చామని అన్నారు. ఇక అధికారం తమకు లేకపోయినా బాధ లేదని కానీ రాష్ట్రం బాగుండాలనే తాను తగ్గాను అన్నారు. తనకు కానీ చంద్రబాబుకు కానీ అధికారం అవసరం లేదని ఏపీ బాగు కోసమే తాము నిలబడ్డామని పవన్ తణుకు సభలో చెప్పుకొచ్చారు.

వైసీపీలో దోపిడి అంతటా జరిగింది అని పవన్ మండిపడ్డారు. దోచుకోవాలనుకునేవారు అభివృద్ధిని అసలు పట్టించుకోరని ఆయన అన్న్నారు. వైసీపీ పాలకులకు రాష్ట్రం మీద ప్రేమ చిత్తశుద్ధి లేవని ఆయన అన్నారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు డ్యాన్సుల మీద ఉన్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం మీద లేదని పవన్ విమర్శించారు.

అలాగే తణుకులో ఉన్న మంత్రి ఓ రైతు ధాన్యం తడిసిపోయిందని అడిగితే ఎంతో ఛీత్కారంగా మాట్లాడారని పవన్ ఆరోపించారు. ఈ ఎన్నికలతో ఆ మంత్రి సర్వం తుడిచిపెట్టుకుపోవాలని ఆయన ఫైర్ అయ్యారు. ఓట్ల చీలికను నివారించామని అలాగే రాష్ట్రం కోసం యువత కోసం ఆడబిడ్డల కోసం రైతుల కోసం చంద్రబాబు తను నిలబడ్డామని తమ కూటమిని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తానికి పవన్ తణుకు స్పీచ్ చూస్తే ఆయన జనసైనికులకు కూడా ఎందుకు తక్కువ సీట్లు తీసుకోవాల్సి వచ్చింది అన్నది వివరించే ప్రయత్నం చేస్తూనే కూటమి ఏపీలో గెలవాల్సిన ఆవసరాన్ని కూడా చాటి చెప్పారని అంటున్నారు.

Tags:    

Similar News