డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన కమిట్ మెంట్ చూపిన పవన్!

బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్.. ఆ వెంటనే తన శాఖలకు సంబంధించి సమీక్షను చేపట్టారు.

Update: 2024-06-20 05:42 GMT

అధికారం చేతిలో లేనప్పుడు మాటలు ఎన్నో చెప్పొచ్చు. కానీ.. తాను చెప్పిన ప్రతి మాటను గుర్తు పెట్టుకొని.. అందుకు తగ్గట్లుగా అడుగులు వేసే రాజకీయ నేతలు చాలా చాలా అరుదుగా ఉంటారు. అది కూడా ఉప ముఖ్యమంత్రిగా తన తొలిరోజునే తన కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చేతలతో చూపించారు పవన్ కల్యాణ్. బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్.. ఆ వెంటనే తన శాఖలకు సంబంధించి సమీక్షను చేపట్టారు.

ఇందుకోసం ఏకంగా పది గంటల సమయాన్ని వెచ్చించటం విశేషం. సాధారణంగా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రోజున హడావుడి ఎక్కువగా ఉంటుంది. అభినందనలు చెప్పేందుకు వచ్చే అతిధులు.. ముఖ్యులతో పాటు.. శాఖా పరమైన అధికారులకు సంబంధించిన పరిచయంతో పాటు.. ఇతర అంశాలు చాలానే ఉంటాయి. కానీ.. వాటి నడుమ కూడా పక్కా ప్లానింగ్ తో రివ్యూను చేపట్టిన వైనం చూస్తే.. పవన్ తీరు అభినందనీయంగా ఉందని మాత్రం చెప్పక తప్పదు.

రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దిన్నరకు పైగా అయినప్పటికీ.. ఎప్పుడూ ఎన్నికల్లో గెలవక.. అధికారం చేపట్టని పవన్ లాంటి వారు.. తొలిసారి ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టిన తొలి రోజునే తన శాఖలకు సంబంధించి తానేం చేయాలనుకుంటున్న దానిపై అధికార యంత్రాంగానికి క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. తన సుదీర్ఘ సమీక్షలో గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపైనా.. గ్రామీణ ప్రాంతాల్లోని మౌలికవసతులు.. మంచినీటి కొరత రాకుండా ఉండటానికి ఏమేం చేయాలన్న దానిపై సలహాలు.. సూచనలు తీసుకున్నారు. అంతేకాదు.. తన ప్రాధాన్యతల్ని అధికారులకు చెప్పిన పవన్.. అందుకు తగ్గ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పటం గమనార్హం.

అంతేకాదు.. సమస్యల పరిష్కారానికి టైం లిమిట్ ను సైతం చెప్పేశారు పవన్. కేవలం మూడు నెలల వ్యవధిలోనే తాను చెప్పిన సమస్యల పరిష్కారాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చెప్పిన పవన్.. మరోసారి తాను రివ్యూ చేస్తానని చెప్పటం గమనార్హం. దీంతో.. తాను చేయాలనున్న పనిని పూర్తి చేసే వరకు వదలనని.. తనది ఒకరోజు హడావుడి చేసే తీరు కాదని.. సమస్యల పరిష్కారం అయ్యేవరకు వదిలి పెట్టనన్న బలమైన సంకేతాల్ని తొలిరోజే ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. తొలి రోజునే తన తీరుతో తన కమిట్ మెంట్ ను పవన్ చెప్పేశారని చెప్పాలి.

Tags:    

Similar News